ముకరంపుర, అక్టోబర్ 12: వానకాలం సీజన్‌కు సంబంధించి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సిద్ధమైంది. ఈ మేరకు మార్కెట్ యార్డుల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. జమ్మికుంట మార్కెట్లో ఇప్పటికే పత్తి కొనుగోళ్లు మొదలవగా మిగిలిన మార్కెట్లలోనూ కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రైతులు తమ పంట ఉత్పత్తులను త్వరగా విక్రయించుకునేలా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది.
మార్కెట్ యార్డుల్లో రైతుల నుంచి పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో ప్రతి వ్యవహారాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి మార్కెట్ యార్డుల్లో ఈ నామ్ ద్వారా కొనుగోళ్లు చేపడుతున్నారు. రైతు మార్కెట్ యార్డు ఆవరణలోకి అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి బయటకు వెళ్లేంత వరకు ప్రతి వ్యవహారం ఆన్లైన్లో నమోదవుతుంది. తూకం, పంట నాణ్యత, పరిమాణం, ధర, నగదు చెల్లింపు వివరాలు ఆన్లైన్ తక్‌పట్టీలో నమోదవుతాయి. యార్డుల్లో తాగునీరు, మరుగుదొడ్లతో పాటు విశ్రాంతి భవనాల్లోనూ అన్ని సౌకర్యాలు కల్పించారు.
జిల్లాలో పత్తి 48,941.48 ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ లెక్కలు పేర్కొంటుండగా.. దిగుబడి 36,706 మెట్రిక్ టన్నులుగా ఉండవచ్చని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే జమ్మికుంటలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. దిగుబడి అంతగా లేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు పోటీ పడుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాలతో పత్తి క్షేత్రాలు దెబ్బతిని దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. కరీంనగర్, చొప్పదండి మార్కెట్ యార్డుల్లోనూ పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 7 మార్కెట్ యార్డుల పరిధిలో 20 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. కరీంనగర్లో-3, జమ్మికుంటలో-11, చొప్పదండిలో-1, హుజూరాబాద్‌లో-2, మానకొండూర్‌లో-2, గోపాల్రావుపేటలో ఒక మిల్లు ఉంది. ఒకవేళ మద్దతు ధర కంటే తక్కువ ధర పలికితే కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా మార్కెట్ యార్డుతో పాటు సీసీఐ నిబంధనల మేరకు నోటిఫై చేసిన మిల్లుల్లోనూ మద్దతు ధరకు పత్తి కొనుగోళ్లు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం వానకాలంలో వరి 2.70 లక్షల ఎకరాల్లో సాగైంది. దిగుబడి 5.69 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేశారు. స్థానిక అవసరాలు, విత్తనోత్పత్తి పోనూ రైతులు 4.46 లక్షల మెట్రిక్ టన్నులు విక్రయించే అవకాశం ఉండవచ్చని మార్కెటింగ్ శాఖ అంచనా వేస్తున్నది. అయితే, రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం గ్రామాల్లోనే కేంద్రాలను ఏర్పాటు చేసి వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నది. గత వానకాలంలో 351 కేంద్రాల్లో 3.90 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 346 కేంద్రాల్లో 6.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
వానకాలం సీజన్లో రైతులు సాగు చేసిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు మార్కెటింగ్ శాఖ తరఫున సిద్ధంగా ఉన్నం. ఇప్పటికే అన్ని మార్కెట్లలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రైతుల శ్రేయస్సే మార్కెటింగ్ శాఖ ముఖ్య ఉద్దేశం. పత్తి, వరి ధాన్యం, పప్పుదినుసులు, అపరాలతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలపై వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నిరంతర నిఘా ఉంటుంది. కొనుగోలు వ్యవహారాల్లో ఏమైనా ఇబ్బందులుంటే రైతులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. విచారణ చేపట్టి సత్వరమే చర్యలు తీసుకుంటం.
– పద్మావతి, డీఎంవో