చిగురుమామిడి, అక్టోబర్ 12: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులతో నాణ్యమైన విద్య అందుతున్నదని, విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని జడ్పీటీసీ గీకురు రవీందర్ సూచించారు. మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లు, పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ, పరిశుభ్రతను పరిశీలించారు. పాఠశాలలోని సమస్యలను ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ రావును అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం వంటకాలను పరిశీలించారు. విద్యార్థులకు వడ్డించి, సర్పంచ్‌తో కలిసి భోజనం చేశారు. అనంతరం జడ్పీటీసీ మాట్లాడుతూ, ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని పాఠశాలల అభివృద్ధికి రూ.2.5 కోట్లు కేటాయించిందని తెలిపారు.
పాఠశాలల బలోపేతం కోసం కృషి చేస్తున్నదన్నారు. గత విద్యా సంవత్సరం హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ విద్యా వలంటీర్లను సొంత ఖర్చుతో నియమించారని గుర్తు చేశారు. జిల్లా పరిషత్ నిధుల్లో 40 శాతం పాఠశాలలకే కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఇందుర్తి పాఠశాలలో అదనపు తరగతి గదులు, తరగతి గదుల మరమ్మతు, సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.10.5 లక్షలు కేటాయించారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీరి వెంట సర్పంచ్ అందే స్వరూప, ఉప సర్పంచ్ తోట సతీశ్, ఎస్ఎంసీ చైర్మన్ ఉస్మాన్ పాషా, వార్డు సభ్యులు చెల్పూరి విష్ణుమాచారి, సుధగోని శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ రావు, ఉపాధ్యాయులు ఉన్నారు.