నిబంధనలకు నీళ్లొదులుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ ‘దగా’ఖానలపై రాష్ట్ర సర్కారు నజర్ పెట్టింది. లైసెన్స్‌లు లేకుండా నిర్వహించే నర్సింగ్ హోంలు, పాలి క్లీనిక్స్, డయోగ్నోస్టిక్, ఫిజియోథెరపీ సెంటర్లపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాలతో గత నెలలోనే రంగంలోకి దిగిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం, ప్రత్యేకంగా తొమ్మిది బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేయించింది. అన్ని అనుమతులు ఉన్నాయా..? నిబంధనలు పాటిస్తున్నాయా..? వైద్యులు ఎవరెవరు ఉన్నారు? సర్టిఫికెట్లు సరైనవేనా..? తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించింది. మెజార్టీ చోట్ల పర్మిషన్లు లేకుండా ఏండ్ల తరబడిగా నడుస్తున్నాయని, కొన్నింటిలో కనీసం అగ్నిమాపక నిబంధనలు కూడా పాటించడం లేదని గుర్తించి, పది హేను రోజుల క్రితమే 124 ప్రైవేట్ దవాఖానలకు నోటీసులు జారీ చేసింది. ఊహించని విధంగా అధికారులు చర్యలకు సిద్ధమవుతుండడంతో యాజమాన్యాల్లో వణుకు పుడుతున్నది.
కరీంనగర్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ దవాఖానలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝులిపిస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు లైసెన్స్‌లు లేకుండా నిర్వహించే నర్సింగ్ హోంలు, పాలి క్లీనిక్స్, డయోగ్నోస్టిక్, ఫిజియోథెరపీ సెంటర్లలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తొమ్మిది బృందాలుగా ఏర్పడి గత నెలలో తనిఖీ చేశారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రత్యేక శ్రద్ధతో ఈ తనిఖీలు చేయించారు. లైసెన్స్‌లు లేని, నిర్వహణ లోపాలు, ఇతర అనుమతి పత్రాలు లేని 124 ప్రైవేట్ దవాఖానలకు నోటీసులు జారీ చేశారు. కాగా ఇందులో కొందరు అనుమతులు పొందినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా తెలిపారు.
ఉత్తర తెలంగాణ జిల్లాలకు మెడికల్ హబ్‌గా ఉన్న కరీంనగర్లో పెద్ద సంఖ్యలో ప్రైవేట్ దవాఖానలు ఉన్నాయి. హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన కొన్ని కార్పొరేట్ దవాఖానలు సైతం ఇక్కడ తమ బ్రాంచీలు ప్రారంభిస్తున్నా యి. మహా నగరాలకు తీసిపోకుండా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొందరు నిబంధనలకు విరుద్దంగా దవాఖానలు ఏర్పాటు చేసుకుని ఏళ్ల తరబడిగా గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు.
ప్రధానంగా జిల్లా రిజిస్ట్రేషన్ కమిటీ అథారిటీ (డీఆర్సీఏ)అనుమతులు పొందకపోవడం, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల సంఖ్య 60కి అనుగుణంగా దవాఖానల భవనాలు, దవాఖానకు సరిపడే పార్కింగ్ లేకపోవడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం, అగ్ని మాపక శాఖ నుంచి ఎన్ఓసీ సర్టిఫికెట్ తీసుకోకపోవడం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతి పత్రాలు పొందక పోవడం, మున్సిపల్ శాఖ నుంచి భవన అనుమతులు పొందక పోవడం వంటి అతిక్రమణలపై దృష్టి సారించిన అధికారులు గత నెల 26, 27 తేదీల్లో జిల్లాలోని కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట,చొప్పదండి తదితర పట్టణాల్లో ప్రైవేట్ దవాఖానాల్లో తనిఖీలు చేశారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రత్యేక శ్రద్ధతో ఈ తనిఖీలు చేయించారు.
ఈ మేరకు జిల్లాలో 518 ప్రైవేట్ దవాఖానలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు 124 దవాఖానలు నిబంధనలకు విరుద్ధంగా, డీఆర్సీఏ అనుమతులు లేకుండా ఉన్నట్లు గుర్తించారు. అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఇందులో నుంచి మినహాయించారు. హైదరాబాద్ తర్వా త కరీంనగర్ జిల్లాలోనే ఇంత పెద్ద సంఖ్యలో ప్రైవేట్ దవాఖానలు విస్తరించి ఉన్నాయి. ఇందులో 124 దవాఖానలకు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొందరు ప్రైవేట్ వైద్యులు ఏళ్ల తరబడి డీఆర్సీఏ అనుమతులు లేకుండానే దవాఖానలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న డయోగ్నోస్టిక్, ఫిజియోథెరపీ సెంటర్లలో కనీస సదుపాయాలు కరువైనట్లు గుర్తించారు. వీరికి అలోపతిక్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్-2002 కింద నోటీసులు జారీ చేశారు.
నిబంధనలకు విరుద్దంగా ప్రైవేట్ దవాఖానలు నిర్వహిస్తున్న వైద్యులు, యాజమాన్యాలకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత కొందరు ఆగమేఘాలపై సవరణలు చేసుకున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ గత నెల 20న డీఆర్సీఏ అధికారులు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించి ప్రైవేట్ దవాఖానల్లో తనిఖీలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయం తెలిసిన ప్రైవేట్ దవాఖానల నిర్వాహకులు తమలో ఉన్న లోపాలను సర్దుకున్నట్లు తెలిసింది. రెండు మూడు రోజులు తనిఖీలు చేపట్టిన అధికారుల దృష్టికి ఈ విషయాలు కూడా వచ్చాయి. అయితే వారు ఏమీ చేయలేని పరిస్థితి. ఆర్ఎంపీ వైద్యులు, అసలు వైద్యులే కాని వారు కూడా కొన్ని క్లీనిక్‌లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవన్నీ తనిఖీ బృందాల దృష్టికి వచ్చినట్లు తెలుస్తుండగా, నిబంధనలు మాత్రమే చూడాలని తమకు ఉన్న ఆదేశాల పరిధిలోనే అధికారులు తనిఖీలు జరిపినట్లు తెలుస్తోంది. అనేక డయోగ్నో సెంటర్లలో సరిపడా మెడికల్ ఎక్విప్మెంట్స్ లేకున్నా రోగుల నుంచి పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో ఏ ప్రైవేట్ దవాఖానలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏ పరీక్షకు ఎంత? ఏ శస్త్ర చికిత్సకు ఎంత? వ్యాధిని బట్టి అందించే చికిత్సకు ఎంత ఫీజు తీసుకుంటున్నారో..? ప్రైవేట్ దవాఖానల్లో బోర్డులు ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి బోర్డులు అనేక దవాఖానల్లో మచ్చుకు కూడా కనిపించడం లేదు. అధికారులు చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో అప్పట్లో ఏర్పాటు చేసిన బోర్డులు కొద్ది రోజులకే తొలగించుకున్నారు. ఇప్పుడు ఇటు ప్రైవేట్ దవాఖానల్లో, డయోగ్నో సెంటర్లలో ఎప్పటిలాగే యథావిధిగా ఫీజులు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు.
జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా నెలకొల్పిన ప్రైవేట్ దవాఖానలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. మొ త్తం 124 దవాఖానలకు నోటీసులు జారీ చేయ గా, ఇందులో 80 శాతం మంది నిర్వాహకులు తమ లోపాలను సవరించుకున్నారని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా తెలిపారు. ఈ 124లో 104 దవాఖానలకు అనుమతులు లేవని, మిగతా వాళ్లు దరఖాస్తు చేసుకున్నారని ఆమె అన్నారు. నోటీసులు జారీ చేసి వదిలేయకుండా కలెక్టర్ కర్ణన్ ప్రత్యేక దృష్టి సారించి ఫాలోఅప్ చేస్తున్నారు.
నిజానికి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దవాఖానలకు ఇచ్చిన నోటీసుల్లో మూడు రోజుల వ్యవధి మాత్రమే ఇచ్చారు. ఇందులో అనుమతులు లేకుండా ఉండడంతోపాటు నిర్వహణకు అనుగుణంగా లేని భవనాలు, అగ్నిమాపక శాఖ నుంచి ఎల్వోసీ తీసుకోని దవాఖానలు సైతం అనేకం ఉన్న ట్లు తెలుస్తున్నది. గత నెల 26, 27 తేదీల్లో నోటీసులు జారీ చేయగా, ఇప్పటి వరకు 80 శాతం దవాఖానల్లో మాత్రమే సవరణలు జరిగినట్లు అధికారులు చెబుతున్న నేపథ్యంలో మిగతా దవాఖానల పరిస్థితిని కలెక్టర్ కర్ణన్ మరోసారి సమీక్షించాలని పలువురు కోరుతున్నారు.