దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన నుమాయిష్ ఎగ్జిబిషన్ ఇక కరీంనగర్‌కు రానున్నది! ఇన్నేళ్లు కేవలం నాంపెల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొనసాగిన ఈ ఎగ్జిబిషన్ మొదటిసారిగా రాజధాని వెలుపల ఏర్పాటు కాబోతున్నది! ఈ మేరకు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు బుధవారం రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ను కలిశారు. హైదరాబాద్ తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్లో ఫిబ్రవరి 15 తర్వాత ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయడంపై చర్చించారు.
కార్పొరేషన్, అక్టోబర్ 12: నుమాయిష్ ఎగ్జిబిషన్ దేశంలోనే ప్రఖ్యాతిగాంచింది! 82ఏళ్ల చరిత్ర కలిగిన ఈ నుమాయిష్‌ను ఇప్పటివరకూ హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్లో తప్ప రాష్ట్రంలో మరెక్కడా ఏర్పాటు చేయలేదు. ముఖ్యంగా బ్రాండెడ్ ఉత్పత్తులు, ఫుడ్‌స్టాల్స్, ఎలక్ట్రికల్స్ వస్తువులు, గృహాలంకరణ వస్తువులు, దుస్తులు ఇలా అన్నీ ఈ ఎగ్జిబిషన్లో దొరికే అవకాశముంటుంది. అందులో జాతీయ, అంతర్జాతీయంగా పేరు పొందిన సంస్థలు కూడా పాల్గొంటాయి. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెంది, కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్, ఐటీ టవర్స్ వంటి ప్రాజెక్టులతో కరీంనగర్ దూసుకుపోతున్నది.
ఈ నుమాయిష్‌ను కరీంనగర్లో ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతప్రజలకు కొత్త వస్తువులను అందుబాటులోకి తేవడానికి ఆస్కారముంటుంది. అలాగే జాతీయ, అంతర్జాతీయంగా కరీంనగర్‌కు గుర్తింపు లభించే అవకాశముంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొనే నుమాయిష్‌ను నగరంలో ఏర్పాటు చేయాలని నిర్వాహకులను మంత్రి గంగుల కమలాకర్ గతంలో ఆహ్వానించారు. ఈ మేరకు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు బుధవారం మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ను మినిస్టర్ క్వార్టర్స్‌లో కలిశారు.
వచ్చే జనవరి 1 నుంచి పిబ్రవరి 15 వరకు హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 82వ నుమాయిష్‌ను నిర్వహిస్తుండగా, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కరీంనగర్లో నిర్వహించాలన్న ప్రతిపాదనలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన వైస్ ప్రెసిడెంట్ అశ్విన్ మార్గం, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాశంకర్, సెక్రటరీ సాయినాథ్ దయాకర్, సభ్యులు వీ జయరాజ్ పాల్గొన్నారు.