సిరిసిల్ల రూరల్/గంభీరావుపేట, అక్టోబర్ 11: ఆపదలో ఉన్నా అన్నా.. అనగానే స్పందించే రామన్న మరోసారి బాధితులకు ఆపన్నహస్తం అందించి అండగా నిలిచారు. ప్రజా క్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న మంత్రి కేటీఆర్ పలువురికి ఎల్వోసీ అందజేసి, మరొకరికి దవాఖాన బిల్లు మాఫీ చేయించి ఆపద్బాంధవుడయ్యారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న బాలుడి చికిత్సకు రూ.3లక్షల ఎల్వోసీ, హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్యకర్తకు రూ.90 వేల ఎల్వోసీ అందజేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మరో బాధితుడికి దవాఖాన బిల్లు రూ.లక్ష మాఫీ చేయించి ఆ కుటుంబానికి భరోసానివ్వగా, ఆ బాధిత కుటుంబసభ్యులు మంత్రి కేటీఆర్‌కు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరోసారి ఔదార్యం చాటుకున్నారు. ముగ్గురు బాధితులకు ఆపన్నహస్తం అందించి అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్‌కు చెందిన చింతలపల్లి భాస్కర్‌రెడ్డి కొడుకు సిధ్దార్థరెడ్డి(3) కాలేయ వ్యాధితో గత కొన్ని రోజులుగా బాధపడుతున్నాడు. సిద్ధార్థ్‌రెడ్డి విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ స్పందించి, వైద్యానికి రూ.3లక్షల ఎల్వోసీ మంజూరు చేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి హైదరబాద్‌లోని ప్రగతిభవన్‌లో లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత మిట్టపల్లి జవహర్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు నల్లగొండ ప్రవీణ్‌గౌడ్,మునిగే ప్రభాకర్, నాయిని సాయికృష్ణ, బద్దం భూపాతిరెడ్డి తదితరుల సమక్షంలో ఎల్వోసీ పత్రాలను మంత్రి కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబసభ్యులు మంత్రి కేటీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు.
కార్యకర్తకు రూ.90 వేల ఎల్వోసీ
అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తకు మంత్రి కేటీఆర్ రూ.90వేల ఎల్వోసీ అందజేసి అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన అబ్బతిని భూమరాజు కొద్ది రోజులుగా మెడ నొప్పితో బాధపడుతూ అనారోగ్యానికి గురయ్యాడు. హైదరాబాద్‌లో పరీక్షలు చేయించుకోగా శస్త్ర చికిత్స చేయాలని, లక్ష వరకు ఖర్చవుతుందని వైద్యులు సూచించారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబానికి పెద్ద సమస్య వచ్చిందని ఎంపీపీ వంగ కరుణ, స్థానిక పార్టీ నేతలు భూమరాజు వారం క్రితం మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి కేటీఆర్ మంగళవారం వైద్య చికిత్స కోసం రూ. 90 వేల ఎల్వోసీని నిమ్స్ వైద్యశాలకు మంజూరు చేశారు. అడగ్గానే సాయం చేసిన అమాత్యుడికి జీవితాంతం రుణపడి ఉంటామని భూమరాజు దంపతులు చేతులెత్తి దండం పెట్టారు.
రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.లక్ష బిల్లు మాఫీ
తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్‌కు చెందిన బొల్గం రవి దసరా రోజున రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స చేయిస్తున్నారు. రవికి ముక్కు సర్జరీ చేశారు. చేతి వేళ్లు, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వారం పాటు చికిత్స పొందగా, సుమారు రూ. 2లక్షలకు పైగా వైద్యానికి ఖర్చు కాగా, మంగళవారం డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రూ.లక్ష బిల్లు మాఫీ చేయించి డిశ్చార్జి చేయించారు. దీంతో మంత్రి కేటీఆర్‌కు, సహకరించిన జడ్పీటీసీ పుర్మాణి మంజుల, రాంలింగారెడ్డికి రవితోపాటు కుటుంబసభ్యులు, నేతలు కృతజ్ఞతలు తెలిపారు. రవి వెంట మాజీ ఎంపీటీసీ శ్యాగ దేవేందర్, ఉపసర్పంచ్ వర్కలం మల్లేశం, కోఆప్షన్ సభ్యుడు ఎండీ తాజొద్దీన్, జెల్ల పోచయ్య, బోలవేని ఏల్లంయాదవ్, పిట్ల భిక్షపతి,వర్కల రమేశ్, జక్కుల రవి, పొన్నాల కిషన్, వర్కల ఆంజనేయులు, చెప్యాల తిరుపతి తదితరులు ఉన్నారు.