ధర్మారం, అక్టోబర్ 11 : ధర్మపురి నియోజక వర్గంలోని ప్రభుత్వ విద్యా రంగ సంస్థలు, అంగన్వాడి కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి, రైతులకు మౌలిక వసతులు, ఉచిత వైద్యానికి సహకారం అందించేందుకు విదేశీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం అమెరికాకు చెందిన ల్యాటర్ డీసెంట్స్ (ఎల్డీఎస్) పెట్రోసియా గర్లక్, రిచర్డ్ గర్లక్తోపాటు ఆ సంస్థ ఏసియా ఖండం ప్రతినిధి శంకర్లుక్, ఇండియన్ సొసైటీ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ జీసెస్ క్రైస్ట్ ఆఫ్ లాటిట్ సైన్స్ హైదరాబాద్ ప్రతినిధులు జాన్ హుటి, నెహిమియా, మనోహర్, తదితరులు ధర్మారంలోని అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఎర్రగుంటపల్లిలోని ప్రాథమిక పాఠశాల, బొమ్మారెడ్డిపల్లిలోని యూపీఎస్ పాఠశాలను మంత్రి, ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహలతతో కలిసి పరిశీలించారు. ఇక్కడ ప్రభుత్వం ఇస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించి ప్రశంసించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాలలో మంత్రి మాట్లాడుతూ ‘మన ఊరు – మన బడి ’ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నదని, ఈ క్రమంలో మరిన్ని మౌలిక వసతుల కల్పనకు ఎల్డీఎస్ సహకారం తీసుకుంటామని చెప్పారు. ఈ సంస్థ ప్రతినిధుల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఎల్ఎం కొప్పుల సంస్థ ద్వారా ఈ నెలలోనే మరొక కార్యక్రమానికి శ్రీకారం చుడతామని, మేధా సంస్థ ద్వారా విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలకు ఆంగ్లంపై ఉచిత శిక్షణ ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కంటి సమస్యలతో బాధ పడుతున్న నేపథ్యంలో వచ్చే నెలలో ‘దృష్టి’ పేరుతో కంటి పరీక్షలు నిర్వహించి, లోపం ఉన్న వారికి కళ్లద్దాలు అందించడం, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఎంఈవో పినుమల్ల ఛాయాదేవి అధ్యక్షత వహించగా, ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, సర్పంచ్ పూస్కూరు జితేందర్‌రావు, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, ఎంపీటీసీ తుమ్మల రాంబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్‌రెడ్డి, స్థానిక ఉప సర్పంచ్ ఆవుల లత, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, తహసీల్దార్ ఆర్ వెంకటలక్ష్మి, ఎంపీడీవో జయశీల, ప్యాక్స్ మాజీ చైర్మన్ పూస్కూరు నర్సింగారావు, తదితరులు పాల్గొన్నారు.