కోల్‌సిటీ, అక్టోబర్ 11: రామగుండం పారిశ్రామిక ప్రాంత మహిళలు ప్రతి రంగంలోనూ నేర్పు, ఓర్పుతో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఇటీవల సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ఒకేరోజు కేవలం 16 గంటల వ్యవధిలో విరామం లేకుండా 620 మంది మహిళలకు ఉచితంగా ఐబ్రోస్ చేసిన గోదావరిఖని లక్ష్మీనగర్‌లోని న్యూ అలంకృత బ్యూటీపార్లర్ నిర్వాహకురాలు లలితా అశోక్‌కుమార్ ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం గోదావరిఖని లక్ష్మీనగర్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు సంస్థ సౌత్ ఇండియా కో-ఆర్డినేటర్ రంగ జ్యోతి అవార్డును ఎమ్మెల్యే చందర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి రంగంలోనూ నేర్పు, కూర్పు, ఓర్పు అవసరమనీ, అలాంటి సద్గుణాలు కలిగిన వారు తప్పక గుర్తింపు సాధిస్తారన్నారు. గోదావరిఖనిలో బ్యుటీషియన్ రంగంలో అపారమైన అనుభవం ఉన్న లలిత సాధించిన ప్రతిభ ఈ ప్రాంతంలో ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని చెప్పారు. ఇక్కడ భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి రాకేశ్, మేయర్ అనిల్‌కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కార్పొరేటర్లు రాజ్‌కుమార్, కృష్ణవేణి, కవిత సరోజని, స్వరూప, శిరీష, పలు సంఘాల బాధ్యులు దయానంద్ గాంధీ, అడ్డాల రామస్వామి, ముద్దసాని సంధ్యారెడ్డి, సంతోషారెడ్డి, అశోక్ ఉన్నారు.