కార్పొరేషన్, అక్టోబర్ 11: నగరంలోని శివారు డివిజన్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిచ్చి నిధులు కేటాయించడంతో పాటు పనులు చేపడుతున్నట్లు మేయర్ వై సునీల్‌రావు తెలిపారు. 19వ డివిజన్లో మంగళవారం ఆయన పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరంలో విలీనమైన డివిజన్లలో ముందుగా తాగునీరు, వీధి దీపాల ఏర్పాటు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటికి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించామన్నారు. శివారు డివిజన్లలో రోజూ మంచినీటి సరఫరా కోసం పైపులైన్లు వేసేందుకు టెండర్ల ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పనులు త్వరలోనే చేపట్టి వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా బల్దియా పాలకవర్గం పని చేస్తోందన్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నట్లు తెలిపారు. స్మార్ట్‌సిటీ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను వ్యయం చేసి ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ప్రజలు కూడా అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు ఏ రాజశేఖర్, సుధగోని మాధవీకృష్ణాగౌడ్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు తిరుపతి, రాములు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.