మెట్పల్లి రూరల్, అక్టోబర్ 10: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. సోమవారం ఎంపీపీ మారు సాయిరెడ్డి అధ్యక్షతన జరిగిన మెట్పల్లి మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పలువురు సభ్యులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని సూచించారు. వరికి ప్రత్యామ్నాయంగా లాభసాటి పంటలను సాగు చేసేలా వ్యవసాయాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు రైతులను ప్రోత్సహించాలని చెప్పారు. పంటమార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో జడ్పీటీసీ కాటిపెల్లి రాధశ్రీ, ఎంపీడీవో భీమేశ్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.