వెల్గటూర్, అక్టోబర్ 10: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జిల్లా శిశు, మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 1098 హెల్ప్ లైన్ కో ఆర్డినేటర్ శ్రావణ్ మాట్లాడుతూ, బాల, బాలికలకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కల్పించారు. 18 సంవత్సరాల వయసు గల వారు తమ సమస్యలపై 1098 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు మంగళవారం అందజేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, 1098 సిబ్బంది పాల్గొన్నారు.
కథలాపూర్, అక్టోబర్ 10: బాలిక దినోత్సవం సందర్భంగా కథలాపూర్ జడ్పీ హైస్కూల్లో 1098 ఆకారంలో విద్యార్థులు కూర్చుండి ప్రదర్శన ఇచ్చారు. బాలికలు అత్యవసర వేళల్లో సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 1098 వినియోగించుకోవాలని నినదించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ రాధిక, హెచ్ఎం అర్జున్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.