కోరుట్ల రూరల్, అక్టోబర్ 10: మండలాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. సోమవారం కోరుట్ల మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ తోట నారాయణ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ మండలాభివృద్ధికి కృషి చేయాలన్నారు. జిల్లాలోనే కోరుట్ల మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.
గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా కొంతమేర అస్తవ్యస్థంగా ఉందని ప్రజాప్రతినిధులు తెలుపగా, పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారికి సూచించారు. మిషన్ భగీరథ పనులను సరిగా చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలు, 24గంటల ఉచిత కరెంట్ తదితర పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. వివిధ శాఖల అధికారులు మండల పురోగతిపై వివరించగా, గ్రామాల్లో ఉన్న పలు సమస్యలను ప్రజాప్రతినిధులు సభదృష్టికి తీసుకువచ్చారు.
పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ తోట నారాయణ, జడ్పీటీసీ దారిశెట్టి లావణ్య, వైస్ ఎంపీపీ చీటి స్వరూప, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ చీటి వెంకట్రావ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షురాలు పిడుగు రాధ, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షురాలు గడిగొప్పుల మాధు రి, జిల్లా సహకార సంఘాల ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నర్సారెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ ఖయ్యుం, ఎంపీడీవో నీరజ, పీఆర్ డీఈ గోపాల్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటీసీలు, సహకార సంఘాల అధ్యక్షులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.