జగిత్యాల.. తెలంగాణ అన్నంగిన్నెలా మారింది. కాలమేదైనా బంగారు పంట పండుతున్నది. 1980 వరకు సాగునీటి వసతి లేక తల్లడిల్లిన జిల్లా నేడు పచ్చని పంటలతో అలరారుతున్నది. భూములను బీళ్లు పెట్టి, వలస బాట పట్టిన నాటి పరిస్థితుల నుంచి.. ఇప్పుడు లక్షలాది మందికి ఎవుసమే బతుకుదెరువైంది. శ్రీరాంసాగర్, ఎస్సారెస్పీ పునర్జీవం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో జిల్లా సస్యశ్యామలంగా మారింది. వరదకాలువకు తూములు ఏర్పాటు చేసి చెరువులను నింపడం, 24గంటల నిరంతర విద్యుత్ ఫలితంగా రెండేళ్ల నుంచి లక్షలాది ఎకరాల్లో పంట పండుతున్నది. సగటున ఏటా 7 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా, ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో ఏయేటికాయేడు సేద్యం పెరుగుతూ వస్తున్నది.
జగిత్యాల, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : సాగునీరు లేక సేద్యం చేయలేని పరిస్థితిలో తల్లడిల్లిన జగిత్యాల ప్రాంత రైతాంగానికి 1980లో ప్రారంభమైన ఎస్సారెస్పీ ప్రాజెక్టు, కాలువలు సేద్య రంగానికి భరోసానిచ్చాయి. ఎంత కష్టం చేసినా ఫలితం కనిపించడం లేదని నిరాశలో కుంగిపోయి, దుబాయి, మస్కట్ దేశాల బాట పట్టిన జిల్లా ప్రజలకు వ్యవసాయం చేస్తే బతుకొచ్చన్న ఆశను కల్పించాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ నేతృత్వంలో తీసుకున్న చర్యలు జిల్లాను తెలంగాణ రాష్ర్టానికే అన్నం గిన్నెగా మార్చేశాయి.
ఎస్సారెస్పీ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆధారంగా ఎస్సారెస్పీ పునర్జీవ పథకం, జిల్లాలోని ఆయకట్టేతర మండలాల్లోని చెరువులను నింపేందుకు వరద కాలువకు తూముల ఏర్పాటు , 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతుబీమా వర్తింపుతో జిల్లా వ్యవసాయ రంగం అగ్రపథానికి చేరింది. వరుసగా రెండేండ్ల నుంచి జి ల్లాలో ఏటా లక్షలాది ఎకరాల్లో పంట సాగవుతున్నది. వానకాలం, ఎండకాలం అన్న తేడా లేకుం డా జిల్లాలోని రైతన్నలు సేద్యంలోనే మునిగి తే లుతున్నారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా జిల్లా లో గణనీయంగా సేద్య శాతం పెరుగుతున్నది.
2021 వానకాలంలో జిల్లాలో సేద్యం మొదటిసారిగా 3.50 లక్షల ఎకరాలను దాటి వేసింది. వర్షాలు సమృద్ధిగా కురవడం, వరద కాలువ వినియోగంలోకి రావడం, పునర్జీవ పథకంతో చెరువులు నిండిపోయాయి. భూగర్భజలాలు సైతం గణనీయంగా పెరగడం, ప్రభుత్వం 24గంటల పాటు విద్యుత్ ఇవ్వడంతో రైతున్నలు కొత్త ఆశలతో సేద్యం మొదలు పెట్టారు. జిల్లాలో వరి పంట 2,92,855 ఎకరాల్లో సాగు చేయబడి రికార్డు సృష్టించింది. మక్కజొన్న 55,037 ఎకరాలు, పత్తి 21,242 ఎకరాలు, చెరుకు 898 ఎకరాలు, సోయాచిక్కడు 1831 ఎకరాలు, అ నుములు 464 ఎకరాలు, పెసర 468 ఎకరాలు, కంది 10,717 ఎకరాలు, ఇతర పంటలు 93 ఎకరాల్లో సాగు చేశారు. మొత్తంగా జిల్లాలో గతేడాది వానకాలంలో 3,83, 512 ఎకరాల్లో పం టలు సాగయ్యాయి. తొలిసారిగా జిల్లాలో దాదా పు 4లక్షల ఎకరాల్లో సాగవడం గమనార్హం.
వానకాలంలో సేద్యం ఎక్కువగానే ఉందని అధికారులు భావించినా, గతేడాది రబీ సీజన్లో సైతం పంట పెద్ద మొత్తంలోనే సాగు చేశారు. ఏకంగా యాసంగిలోనూ దాదాపు 3 లక్షల ఎకరాల్లో పంట సాగు చేశారు. గతేడాది యాసంగిలో వరి 2,08,207 ఎకరాల్లో సాగైంది. సజ్జలు 2,945 ఎకరాలు, జొన్నలు 746 ఎకరాలు, మక్క 14,153 ఎకరాలు, గోధుమలు 279 ఎకరాలు, చెరుకు 2082 ఎకరాలు, పల్లి 1091 ఎకరాలు, ఆవాలు 3,266 ఎకరాలు, నువ్వులు 29,202 ఎకరాలు, శనగలు 703 ఎకరాలు, మి నుములు 5,258 ఎకరాలు, అలిసంత 1,094 ఎకరాలు, పెసర 3,134 ఎకరాలు, ఇతర పంట లు 492 ఎకరాల్లో సాగయ్యాయి. మొత్తంగా యాసంగిలో 2.73 లక్షల ఎకరాల్లో సాగైంది.
ఈ ఏడాది వానకాలంలోనూ జిల్లాలో పెద్ద మొత్తంలోనే పంటలను రైతులు సాగు చేస్తున్నారు. వ్యవసాయశాఖాధికారుల అంచనా ప్రకారం జిల్లాలో ఈ వానకాలంలో దాదాపు 3.80 లక్షల ఎకరాల్లో పంట సాగవుతున్నది. వరి 3,10,158 ఎకరాలు, మక్క 40,369 ఎకరాలు, పత్తి 25,238 ఎకరాలు, చెరకు 500 ఎకరాలు, సోయాచిక్కుడు 2,130 ఎకరాలు, పెసర్లు 105 ఎకరాలు, అనుములు 278 ఎకరాలు, కంది 3,433 ఎకరాలు, ఇతర పంటలు 150 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
జిల్లాలో ఏటా సగటున 7 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. వానకాలంలో దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో సాగవుతుండగా, యాసంగిలో దాదాపు మూడు లక్షల ఎకరాల్లో పంట సాగవుతుండడం గమనార్హం. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా జగిత్యాల జిల్లాలో మాత్రమే ఏకంగా ఏటా ఏడు లక్షల ఎకరాలు సాగవుతుండడం గమనార్హం. సగటున వానకాలం, యాసంగి పంటల సందర్భంగా లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతున్నది. గతేడాది వానకాలం సీజన్లో దాదాపు ఆరున్నర లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం, యాసంగిలో దాదాపు 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. రాష్ట్రంలోనే అత్యధికంగా వరిని పండిస్తున్న రాష్ట్రంగా జగిత్యాల రికార్డు సాధిస్తూనే ఉంది. గతేడాది మాదిరిగా ఈ ఏడాది సైతం వానకాలం, యాసంగిలో జగిత్యాల జిల్లా రికార్డు స్థాయిలో వరిధాన్యం దిగుబడిని సాధిస్తుందని వ్యవసాయాశాఖాధికారులు అంచనా వేస్తున్నారు.
జిల్లాలో పరిస్థితులు సేద్యరంగానికి అనుకూలంగా ఉండడం, నీటి వసతి, విద్యుత్, ఎరువు లు, భూగర్భజలాల వృద్ధి తదితర అంశాల నేపథ్యంలో జిల్లాలో వ్యవసాయం చేసేవారి సంఖ్య పెరుగుతున్నది. గతంలో వ్యవసాయం చేయడం దండుగ అనుకొని మానేసి, ఇతర వృత్తుల్లోకి, బతుకుదెరువు కోసం దుబాయి, మస్కట్ లాంటి దేశాలకు వలస వెళ్లిన వారు సైతం తిరిగి వచ్చి గ్రామాల్లో సేద్యం చేసుకుంటున్నారు.
దీంతో క్ర మంగా జిల్లాలో సేద్య విస్తీర్ణం పెరగడంతోపా టు, రైతుబంధు, రైతుబీమా లబ్ధిదారుల సంఖ్య సైతం పెరుగుతున్నది. 2021 వానకాలంలో జిల్లాలో 2,03,843 మందికి రైతుబంధు వర్తించింది. 2021 వానకాలం పంట సమయంలో 205. 54 కోట్లు మంజూరయ్యాయి. యాసంగిలో 2,10,452 మందికి 207.15 కోట్లు మంజూరు చేసింది. ఈ వానకాలంలో రైతుబం ధు లబ్ధిదారుల సం ఖ్య 2,15,673కి పెరగగా, జిల్లాకు ప్రభుత్వం 207.57 కోట్లు మంజూరు చేసింది. జిల్లాకు రైతుబంధు పథకం కింద ఏటా (రెండు పంటలకు కలుపుకొని) సగటున 400 కోట్లకు పైగా ప్రభుత్వం మంజూరు చేస్తున్నది.