భారతీయ జనతా పార్టీ తాజాగా నియమించిన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిల వ్యవహారం ఆ పార్టీలో చిచ్చురేపుతోంది. అనాదిగా పార్టీని నమ్ముకున్న వారిని నియామకాల పేరుతో అసెంబ్లీ ఎన్నికలకు దూరం పెట్టాలన్న కుట్ర ఇందులో దాగి ఉందన్న అనుమానాలు ఆ పార్టీలో వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ బాధ్యులుగా నియమితులైన వారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ స్వయంగా చెప్పడం.. ఆ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్యక్షత వహించడం నాయకుల అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న నాయకులెవరూ తమకు కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లబోమంటూ ఇప్పటికే అధిష్టానానికి సంకేతాలు ఇచ్చారు. అలా కాదని ఒత్తిడి చేస్తే తిరుగుబాటు చేయాలన్న నిర్ణయానికి చాలా మంది వచ్చినట్లు సమాచారం. కాగా.. ఈ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందో అన్న ఆందోళన ఆ పార్టీలో వ్యక్తమవుతుండగా, సునీల్ బన్సల్ మాటలను ఆచరణలో పెడితే.. ఉమ్మడి జిల్లాలో పెద్ద మొత్తంలో బీజేపీ ఆశావహులకు నిరాశే ఎదురు కానుంది.
– కరీంనగర్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, అక్టోబర్ 9,(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఇన్చార్జి చొప్పున రెండు రోజుల క్రితం నియమించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి మినహా మిగిలిన 12 నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించారు. కరీంనగర్ అసెంబ్లీ ని యోజకవర్గ ఇన్చార్జిగా పీ పాపారావుకు బాధ్య తలు అప్పగించింది. అలాగే, చొప్పదండి ఇన్చార్జిగా హరినాయక్, మానకొండూరుకు ఎర్రం మహేశ్, హుజూరాబాద్‌కు కుసుమ సతీశ్, హు స్నాబాద్‌కు గుజ్జ సత్యనారాయణరావు, సిరిసిల్లకు గంగిడి మోహన్‌రెడ్డి, వేములవాడకు మీసాల చంద్రయ్య, జగిత్యాలకు సంగారెడ్డి జిల్లాకు చెందిన చంద్రశేఖర్, కోరుట్లకు రాం సుధాకర్, ధర్మపురికి కే సాంబయ్య, రామగుండానికి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, మంథనికి కొండాపురం జగన్‌ను నియమించింది. ఇందులో చాలా నియోజకవర్గాలకు ఈ ప్రాంతాలు తెలియని వ్యక్తులను ఇన్చార్జిలుగా నియమించారు. ఈ నిర్ణయంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
కాక రేపుతున్న బన్సల్ వ్యాఖ్యలు..
శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ జిల్లా అధ్యక్షులు, కొత్తగా నియమించిన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిలతో సమావేశాలు జరిగాయి. ఇందులో ప్రధాన వ్యక్తగా పాల్గొన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ బీజేపీ నుంచి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిలుగా నియమితులైన వారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలంటూ స్పష్టం చేశారు. దీంతో ఇన్చార్జిలుగా నియమితులైన వారంతా అవాక్కయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్, సహ ఇన్చార్జి అరవింద్ మేనస్ ఉండగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ‘రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఏరికోరి ఇన్చార్జిలుగా నియమిం చాం. మీ బాధ్యతలు చాలా ఉన్నాయి. ఆషామాషీగా కాకుండా కష్టపడి పనిచేయాలి’ అంటూ చెప్పిన బన్సల్ ఇదే సమయంలో నియోజకవర్గా ల్లో పార్టీని గెలిపించే బాధ్యత మీదేనని, అందుకే నియోజకవర్గ ఇన్చార్జిలెవ్వరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దు అంటూ స్పష్టం చేశారు. వాస్త వా నికి నియోజకవర్గ ఇన్చార్జిల నియామక ప్రక్రి య బాగా లేదని అప్పటికే మండిపడుతున్న శ్రేణులు.. కొందరు బన్సల్ ఈ మాటలను మొహమాటం లేకుండా వారి అభిప్రాయాలను చెప్పినట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. బన్సల్ మాటల్లో నిగూడ అర్థం ఉందని, ఇందంతా కుట్ర ప్రకారమే జరుగుతున్నదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
తిరుగు బావుటా!
నిజానికి చాలా మంది నాయకులు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఒక్కొక్కరూ తమకు అనుకూలమైన నియోజకవర్గాల్లో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇందులో ఆరంభం నుంచి ఉన్న సీనియర్ నాయకులున్నారు. ఇప్పుడు ఇలాంటి వారిని వేరే జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా నియమించారు. అక్కడితో ఆగకుండా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు పోటీ చేయద్దంటూ చెప్పడంతో సదరు నాయకులు ఊగిసలాడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే కొంత మంది సీనియర్ నాయకులకు వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పించకుండా ఉండాలన్న లక్ష్యంతోనే వారిని వేరే నియోజకవర్గాలకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్టారెడ్డి పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో గెలిచారు. ఇప్పుడు అక్కడి నుంచే పోటీ చేయాలని చూస్తున్నారు. కాగా, రామకృష్ణారెడ్డిని గజ్వేల్ నియోకవర్గ ఇన్చార్జిగా నియమించారు. బన్సల్ చేసిన మాటలను బట్టి చూస్తే.. వచ్చే ఎన్నికల్లో పెదపల్లి నుంచి పోటీచేసే అవకాశం రామకృష్ణారెడ్డికి ఇస్తారా? లేదా? అన్న సందేహాలు ఆ పార్టీలో వ్యక్తమవుతున్నాయి. నిజానికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వర్గానికి, అలాగే రామకృష్ణారెడ్డి వర్గానికి మధ్య వైరుధ్యం ఉన్నది.
ఈ నేపథ్యంలోనే రామకృష్ణారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా కుట్ర జరిగిందా? అన్న అనుమానాలు సైతం ఆ పార్టీలో వ్యక్తమవుతున్నాయి. అలాగే, బీజేపీ సీనియర్ నేత సుగుణాకర్‌రావు కరీంనగర్ నుంచి పోటీచేయాలని భావిస్తూ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం సుగుణాకర్‌రావును బోథ్ నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించారు. అలాగే, జిల్లాకు చెందిన బీజేపీ నేతలు రాంగోపాల్‌రెడ్డి, కటకం మృత్యుంజయం, ఎర్రం మహేశ్, కౌశిక్‌హరి, మ్యాన మహేశ్‌లాంటి వాళ్లు వారి వా రి ప్రాంతాల నుంచి పోటీ చేయాలని ఉవ్విల్లూ రుతున్నారు వీరందరినీ వేరు వేరు నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా నియమించారు.
బన్సల్ మా టల ప్రకారం చూస్తే.. వీరిందరూ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాల్సిందేనా? అన్న చర్చ జరుగుతోంది. వీరితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మరికొంత మందిని వేరు వేరు జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా నియమించా రు. ఆరంభం నుంచి ఉన్న నేతలు కొందరైతే.. మధ్యలో వచ్చి సీనియర్లుగా ఉన్న వారు మరికొందరు. నియోజకవర్గ ఇన్చార్జిల పేరుతో వీరందరినీ పోటీ చేయకుండా ఉండేందుకు ఈ బాధ్యత లు అప్పగించారన్న చర్చలు ఆ పార్టీలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిల బాధ్యతలు చేపట్టేందుకు చాలా మంది నిరాసక్తతను ఇప్పటికే అధిష్టానానికి తెలిపినట్లు తెలుస్తోంది.
అంతే కాదు.. ఈ విషయంలో ఉమ్మ డి కరీంనగర్ జిల్లాయే కాదు, మిగిలిన జిల్లాల్లో నూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతోపాటు మెజార్టీ నేతలు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోకి వెళ్లమని అధిష్టానానికి తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ అధిష్టానం ఒత్తిడి చేస్తే తిరుబావుటా ఎగుర వేద్దామని ఇప్పటికే మెజార్టీ నా యకులు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పోటీచేసే నియోజకవర్గాలను వదలి పెట్టి.. కొత్తగా ఇన్చార్జిగా కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లి పనిచేస్తే.. సొంత నియోజకవర్గంలో పరిస్థితి చేజారుతుందన్న ఆందోళన ఆశావహుల్లో ఉండగా.. ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో అన్న ఆందోళన మాత్రం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది.