గంభీరావుపేట, అక్టోబర్ 8: వారంతా ఆరు దశాబ్దాల తర్వాత ఒక్కచోట చేరారు. వివిధ వృత్తులు, ఉద్యోగాలతో వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డవారు చదువుల అమ్మ ఒడిలో కలుసుకున్నారు. ఆత్మీయ పలుకరింపులతో అభివాదాలు చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. శనివారం గంభీరావుపేట కేజీటూపీజీ సముదాయంలో గివ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూర్వవిద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి 1954-2021 వరకు ఇక్కడి పాతబడి, కళాశాలలో చదువుకున్న విద్యార్థులు హాజరయ్యారు. బ్యాచ్‌లవారీగా ఏర్పాటు చేసిన తరగతి గదుల్లో కూర్చోని కబుర్లు చెప్పుకుంటూ సంతోషాన్ని పంచుకున్నారు. వేలాదిమంది రాకతో ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. ఈ సందర్భంగా పూర్వవిద్యార్థులు పరస్పరం పలుకరించుకొని యోగక్షేమాలను తెలుసుకున్నారు. హోదాలను పక్కనబెట్టి ఆటపాటలతో సందడి చేశారు. చిన్ననాటి చిలిపి పనులను నెమరేసుకున్నారు.
సెల్ఫోన్లలో సెల్ఫీలు తీసుకొని ఎంజాయ్ చేశారు. పాఠశాల ప్రథమ ప్రధానోపాధ్యాయుడు విఠల్‌తో మరికొందరు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం సామూహికంగా విందారగించి చీకటి కావడంతో బై..బై చెప్పుకుంటూ బరువెక్కిన హృదయాలతో వీడ్కోలు చెప్పుకుంటూ స్వస్థలాలకు వెళ్లిపోయారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు మాట్లాడారు. మంత్రి కేటీఆర్ చొరవతో రూపుదిద్దుకున్న కేజీటూపీజీ స్కూల్ ప్రాంగణంలో ఇలాంటి గొప్పకార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఆనందంగా ఉన్నదన్నారు. ఇందుకు కృషిచేసిన గివ్ తెలంగాణ ఫౌండేషన్ బాధ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, సర్పంచ్ కటకం శ్రీధర్, ఆయా పాఠశాలల హెచ్ఎంలు గంగారాం, బాలెల్లయ్య, లింగారెడ్డి, దాసు, లక్కిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, ఉపాద్యాయ బృందం, పూర్వ విద్యార్థులు ఉన్నారు.
అపూర్వ సమ్మేళనంలో కుటుంబ సభ్యులు
మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి ఆయా ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడిన కుటుంబ సభ్యులు ఐదుగురు అపూర్వ మహా సమ్మేళనానికి హాజరై ఆనందపడ్డారు. సముద్రాల రామానుజాచార్య, విజయసారధి, నీలకుమారి, హరికృష్ణ, వెంక టరమణ ఒకే కుటుంబ సభ్యులు గంభీరావుపేట పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఉద్యోగరీత్యా హైదరాబాద్, కరీంనగర్ తదితర దూర ప్రాం తాల్లో స్థిరపడిన అపూర్వ సమ్మేళనానికి హాజరై తమ ఆనందాలను కుటుం బమంతా ఒకే వేదికపై పంచుకున్నారు.
స్నేహితులమందరం కలుసుకున్నం..
గంభీరావుపేట కేజీటూపీజీ విద్యాప్రాంగణంలో 60 ఏండ్ల క్రితం చదువుకున్న వారందరం కలుసుకోవడం ఆనందంగా ఉన్నది. సిరిసిల్ల ప్రాంతంలోని గంభీరావుపేట 1954 నుంచి విద్యాబోధనకు పుట్టినిల్లు. ఇప్పుడు ఇదే చోట మంత్రి కేటీఆర్ కృషితో గొప్ప విద్యాలయం రూపుదిద్దుకున్నది. ఇక్కడి వసతులను చూసి అబ్బురపడ్డం. మమ్మల్ని ఒక్కచోటికి చేర్చిన గివ్ తెలంగాణ ఫౌండేషన్ బాధ్యులకు కృతజ్ఞతలు.
– ఎల్. జీవన్‌రెడ్డి, డీఎస్పీ. నిర్మల్
ఎన్నడూ ఊహించలేదు..
1954లో గంభీరావుపేటలో పాఠశాల ఏర్పాటు చేయగా ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు తీసుకున్న. సుమారు 67 సంవత్సరాల తర్వాత అప్పటి విద్యార్థులు తోటి ఉపాధ్యాయ బృందాన్ని ఒకే వేదికపై కలుసుకుంటానని ఏనాడూ ఊహించలేదు. నేను పాఠాలు బోధించిన విద్యార్థులు ఆయా రంగాల్లో ఉన్నతస్థాయిలో నిలువడం ఎంతో సంతోషంగా ఉన్నది. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన గివ్ తెలంగాణ ఫౌండేషన్‌కు రుణపడి ఉంట.
-విఠల్. 1954 పాఠశాల ప్రథమ ప్రధానోపాధ్యాయుడు.
బాల్య స్మృతులను గుర్తుకు తెచ్చుకున్నాం
సిరిసిల్ల ప్రాంతంలో మొదట గంభీరావుపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటైంది. 1981లో మొదటి బ్యాచ్‌లో కళాశాలలో అడ్మిషన్ పొందాను. ఇక్కడ విద్యా భ్యాసం పూర్తి చేసుకుని 42 ఏళ్ల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. బాల్య స్మృతులను గుర్తుకు తెచ్చుకున్నాం. ఉద్యోగ విరమణ పొందే సమయాన అపూర్వ సమ్మేళనంలో పాల్గొనడం ఆనందంగా ఉన్నది.
-భూక్యా రాంరెడ్డి. ఎస్పీ.(సీఐడి) హైదరాబాద్.
అదృష్టంగా భావిస్తున్న..
కేజీ టు పీజీ విద్యా సముదాయంలో ఏర్పాటు చేసిన అపూర్వ సమ్మేళన వేదిక ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది. 42 ఏళ్ల తర్వాత తోటి స్నేహితులను కలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్న. విద్యా బుద్ధులు నేర్చిన పాఠశాల వేదికగా అన్ని తరగుతుల స్నేహితులను కలుసుకుని యోగక్షేమాలు తెలుసుకున్నాం. చిన్ననాటి చిలిపి పనులను గుర్తుకు తెచ్చుకొని ఆనందంలో మునిగితేలినం.
-సముద్రాల రామనుజాచార్యా. జిల్లా సహకార అధికారి, జగిత్యాల