పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల చిరకాల కల సాకారమవుతున్నది. దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఎమ్మెల్యే దాసరి చొరవతో పూర్తికాబోతున్నది. ఈ నెల 10న మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా ఆర్వోబీకి శంకుస్థాపన జరుగబోతుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఇదే సమయంలో జిల్లా కేంద్రంలో పూర్తయిన ఆర్అండ్బీ అతిథి గృహానికీ ప్రారంభోత్సవం చేయబోతుండగా, యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తున్నది. ఈ మేరకు శనివారం ఆర్అండ్బీ గెస్ట్ హౌస్, కూనారం రోడ్లో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే దాసరి, పర్యటన వివరాలు వెల్లడించారు.
– పెద్దపల్లి, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ)
పెద్దపల్లి, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక రైల్వే ఓవర్ బ్రిడ్జి శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 10న మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేతకాని, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్సీ టీ. భానుప్రసాదరావు నిర్మాణ పనులను, పెద్దపల్లిలో నిర్మించిన ఆర్అండ్బీ అతిధి గృహాన్ని వారు ప్రారంభించనున్నారు.
నేడే పనులకు శంకుస్థాపన..
పెద్దపల్లి జిల్లా మీదుగా ప్రధాన రైల్వే మార్గం ఉన్నది. ఈ లైన్‌పై నిత్యం ఢిల్లీ, చెన్నైకి ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్, రాజధాని, గూడ్స్, ప్యా సింజర్ రైళ్లు నడుస్తుంటాయి. అయితే పెద్దపల్లి-కూనారం రహదారి వద్ద రైల్వే లైన్‌పై ఓవర్ బ్రిడ్జి లేదు. రద్దీగా ఉండే లైన్ కావడంతో ప్రతి 15నిమిషాలకు ఒకసారి రైల్వే గేటు పడుతూ ఉంటుంది. దీంతో గేటు పడ్డ ప్రతిసారి పెద్దపల్లి నుంచి హ న్మంతునిపేట, రాంపల్లి, వెన్నంపల్లి, కూనారం, మారేడుగొండ, కాల్వశ్రీరాంపూర్, జమ్మికుంట, వరంగల్, హన్మకొండ ప్రాంతాలకు వెళ్లే వారు నరకం చూసేవారు. ఇక్కడ ఆర్వోబీ నిర్మించాలని ఇక్కడి ప్రజలు ఏండ్లుగా విజ్ఞప్తి చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఈ విషయమై ఎమ్మెల్యే దాసరి ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం కేసీఆర్ దృ ష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించి రూ. 119.5 కోట్లు మంజూరు చేశారు. కాగా, ఈ రైల్వే రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు ఈ నెల 10న రా ష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని, అలాగే రూ.1.80కోట్లతో పెద్దపల్లిలో నిర్మించిన ఆర్అండ్బీ అతిథి గృహాన్ని ప్రారంభిస్తారని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని కమాన్ నుంచి సుభాష్ బొమ్మ దాకా రూ.1.52కోట్లతో నిర్మించనున్న నాలుగులేన్ల రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని వివరించారు.
ఈ మేరకు శనివారం ఆర్అండ్బీ అతిథి గృహంతోపాటు కూనారం రోడ్లో బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించి పర్యటన వివరాలు వెల్లడించారు. గత 50 ఏండ్లలో జరుగని అభివృద్ధిని తాను గత ఎనిమిదేండ్లలోనే చూసి చూపించినట్లు చెప్పారు. దశాబ్ధాల ఆర్వోబీ కల నెరవేరే రోజు ఈ నెల 10 కావడంతో కూనారం రోడ్లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల శాఖల అ ధ్యక్షులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మెల్యే వెంట పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతీశ్రీనివాస్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, పీఏసీఎస్ చైర్మన్లు దాసరి చంద్రారెడ్డి, నర్సింహారెడ్డి, సర్పంచ్ల ఫోరం పెద్దపల్లి మండల అధ్యక్షుడు శంకరయ్య, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.