కార్పొరేషన్, సెప్టెంబర్ 19 : తెలంగాణ అభివృద్ధిని చూసి ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వానికి కడుపు మంటగా మారిందని, అందుకే రాష్ర్టాన్ని ఇబ్బందుల పాల్జేసేందుకు కుట్రలు చేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఘాటుగా విమర్శించారు. ఢిల్లీ గద్దల కన్ను తెలంగాణపై పడిందని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుతంత్రాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం 114 మందికి రూ.1,14,13,224 విలువైన కల్యాణలక్ష్మి చెకులను పంపిణీ చేశారు.
అనంతరం మంత్రి మీ సేవా కార్యాలయంలో 37 మందికి రూ.14,17,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతుంటే చూసి తట్టుకోలేక కొందరు తప్పుడు ప్రచారంతో ప్రజల్లో అయోమయం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.
తెలంగాణ సచివాలయానికి అంబేదర్ పేరును నిర్ణయించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమైక్య పాలనలో కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులు ఉండేవని, వ్యవసాయానికి కరెంటు లేక రైతులు పొలాల వద్ద పడి గాపులు కాసిన రోజులు చూశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ సమస్యలన్నీ తీరాయన్నారు. కరోనాకాలంలో సైతం సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. గత పాలకులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలనే మనసు లేదని విమర్శించారు.
తెలంగాణలో చేపడుతున్న సంక్షేమ పథకాలను బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రతి గడపకూ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని, పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి ఉద్ఘాటించారు. లబ్ధిదారులు సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని, ఆశీర్వాదం అందించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, నగర మేయర్ వై.సునీల్‌రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, ఎంపీపీ లక్ష్మయ్య, కార్పొరేటర్ గుగ్గిళ జయశ్రీ, నాయకుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.