హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మంగళవారం నుంచి రెండు రోజులపాటు జరుగనున్న బయో ఏషియా-2026 (23వ ఎడిషన్) వార్షిక సదస్సులో పాల్గొనాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన గ్లోబల్ లీడర్స్‌కు ఆహ్వానం పలికారు.
హైదరాబాద్‌ను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ రంగ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగస్వాములు కావాలని ఆయన ఓ తాజా ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. టెక్నాలజీపరంగా ఆరోగ్య సంరక్షణ రంగంలో వేగంగా మార్పులు సంభవిస్తున్నాయని, ప్రపంచంలోని ఆయా కంపెనీలు తమ అనుభవాలను పంచుకునేందుకు హైదరాబాద్ బయో ఏషియా సదస్సు వేదికగా ఉంటుందన్నారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో ఏటా నిర్వహించే ఈ సదస్సు.. ఈ ఏడాది ‘టెక్బయో అన్లాష్డ్-ఏఐ, ఆటోమేషన్ అండ్ బయాలజీ రెవల్యూషన్’ అనే థీమ్‌తో నిర్వహించనున్న విషయం తెలిసిందే. లైఫ్‌సైన్సెస్, బయోఫార్మా, హెల్త్‌టెక్ రంగాలకు బయో ఏషియా సదస్సు ఆసియాలోనే అగ్రగామి వేదికగా ఎదిగింది. స్టార్టప్‌లు, పరిశోధకులు, పెట్టుబడిదారులు విధానకర్తలతోపాటు లైఫ్‌సైన్సెస్, మెడికల్ రంగాలకు చెందిన పేరెన్నికగల సంస్థలు ఈ సదస్సుకు హాజరవుతున్నాయి.