తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు తారాస్థాయికి చేరుతున్నాయి. తాజాగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ప్రముఖ నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అగ్ర హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్ను విమర్శించే క్రమంలో నయినార్ నాగేంద్రన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘త్రిష ఇంటి నుంచి విజయ్ బయటికి వచ్చినప్పుడే ఆయనకు రాజకీయ వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి’ అంటూ నయినార్ నాగేంద్ర చేసిన కామెంట్స్ తమిళనాట తీవ్ర చర్చకు దారితీశాయి. తాజాగా వీటిపై త్రిష స్పందించింది. ‘అగౌరవపరిచే మాటల్ని అస్సలు సహించేది లేదు’ అంటూ తన ఎక్స్‌ఖాతాలో పోస్ట్ పెట్టింది త్రిష. దీనికి లీగల్ నోట్‌ను జత చేసింది.
రాజకీయ విషయాల్లో త్రిష ఎప్పుడూ తటస్థంగా ఉన్నారని, సంబంధం లేని విషయాల్లో తన క్లయింట్‌ను లాగి కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దంటూ త్రిష న్యాయ సలహాదారుడు నిత్యేష్ నటరాజ్ ఆ నోట్లో పేర్కొన్నారు. అయితే ఈ వివాదంలో నయినార్ నాగేంద్రన్ వ్యవహార శైలిపై విమర్శలు రావడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. తనకు ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం లేదని, పొరపాటున ఆ వ్యాఖ్యలు చేశానని నయినార్ నాగేంద్రన్ పేర్కొన్నారు.