రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వీరుల త్యాగాలు వెలకట్టలేనివని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కొనియాడారు. ఆదివాసీ బిడ్డ కొమురం భీం, దొడ్డి కొమురయ్య, షోయబుల్లాఖాన్, చాకలి ఐలమ్మ లాంటి మహనీయులు సామాజిక చైతన్యాన్ని రగిలించిన ఆ రోజులను గుర్తు చేశారు. వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ సమాజం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛవైపు అడుగులు వేసిందని చెప్పారు. సుద్దాల హన్మంతు, రావినారాయణరావు, చెన్నమనేని రాజేశ్వర్రావులాంటి పోరా ట యోధులకు నివాళులర్పించారు. ‘తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేస్తున్నాయని, తమ స్వార్థ రాజకీయాల కోసం మంటలు రగిలిస్తున్నాయని ఆగ్రహించారు. తెలంగాణలో అశాంతిని సృష్టించేందుకు మతతత్వ శక్తులు పన్నుతున్న కుట్రలను విచ్ఛిన్నం చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం సిరిసిల్ల కలెక్టరేట్లో మంత్రి జాతీయ జెండాను ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఎనిమిదేండ్ల ప్రభు త్వం పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం కేంద్రంగా రూ.2వేల కోట్ల భారీ పెట్టుబడులతో 15వేల మందికి ఉపాధి కల్పించేలా ఆక్వాహబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ఆనం దా గ్రూప్ సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయని చెప్పారు. సొంత స్థలంలో ఇండ్లను నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం తరపున రూ. 3లక్షలు అందించే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తా మన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా మన రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ హెల్త్ ప్రొఫైల్‌కు శ్రీకారం చుట్టిందని, జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం నమోదు చేస్తూ డిజిటల్ హెల్త్ కార్డులు అందిస్తున్నామన్నరు.