మానకొండూర్ రూరల్, సెప్టెంబర్ 16: ‘బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే పౌరులందరికీ స్వేచ్ఛగా జీవించే అవకాశం కలిగింది. రాజ్యాంగబద్ధమైన హక్కులు సైతం దక్కాయి.’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ఉద్ఘాటించారు. అనేక మంది మహనీయుల త్యాగఫలంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని పేర్కొన్నారు. శుక్రవారం మానకొండూర్‌లో జడ్పీ సీఈవో ప్రియాంక కర్ణన్ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు. మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, గన్నేరువరం, ఇల్లంతకుంట మండలాల నుంచి విద్యార్థులు, మహిళలు, యువతీయువకులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. డప్పుచప్పుళ్ల మధ్య జాతీయ భావం పరిఢవిల్లేలా త్రివర్ణ పతాకాలను చేతబూని భారీ ర్యాలీ తీశారు.
మానకొండూర్ చెరువు కట్ట నుంచి, మార్కెట్ రోడ్, తూర్పు దర్వాజ మీదుగా పల్లె మీది నుంచి ముంజంపల్లి సొసైటీ గ్రౌండ్‌కు చేరుకున్నారు. అంతకుముందు వినోద్‌కుమార్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి మానకొండూర్ చెరువువద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముంజంపల్లి సొసైటీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘వాస్తవానికి మనమందరం 1947 నుంచి స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్నాం. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిననాటి నుంచే పౌరులందరికీ మాట్లాడే స్వేచ్ఛ దక్కడంతో నిజమైన స్వాతంత్య్రం సిద్ధించింది’ అని చెప్పారు. స్వాతంత్య్ర సంగ్రామంలో కమ్యూనిస్టులు సైతం కీలక భూమిక పోషించారని పేర్కొన్నారు.
మన జిల్లాకు చెన్నమనేని రాజేశ్వర్‌రావు భూస్వామ్యవ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించారన్నారు. తెలంగాణలో తెల్లదొరల రాజ్యంతో పాటు నిజాంరాజుల పాలన ఉండేదని గుర్తు చేశారు. దేశానికి 1947లో స్వాతంత్య్రం వస్తే, తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న రాచరిక వ్యవస్థ నుంచి విముక్తి లభించిందన్నారు. రసమయి మాట్లాడుతూ అమరుల త్యాగ ఫలంగానే తెలంగాణ ఆవిర్భవించిందని ఆటపాటల ద్వారా వివరించారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో ప్రగతి వైపు పయనిస్తున్నామనీ, వృద్ధులకు పింఛన్లు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. బద్దం ఎల్లారెడ్డి, అనభేరి ప్రభాకర్ రావు లాంటి ఎందరో మహనీయులు నిజాంలను ఎదురించారని పేర్కొ న్నారు. కొందరు తమ స్వార్థ రాజకీయాల కోసం సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా చిత్రీకరిస్తున్నారని ఆక్షేపించారు.
భిన్నత్వంలో ఏకత్వంగా మనం జీవిస్తున్నామని, అలాంటి వారిని తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జీవీఆర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, ఎంపీపీ ముద్దసాని సులోచన-శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు రామంచ గోపాల్‌రెడ్డి, రొడ్డ పృథ్వీరాజ్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.