ఇప్పుడు చిన్న చిన్న పల్లెలకు వెళ్లినా పెద్ద పెద్ద కిరాణా షాపులు దర్శనమిస్తున్నాయి. పెద్ద ఊర్లల్లో షాపింగ్ మాల్స్, మార్టులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ గంగాధర సంత ప్రత్యేకతను చాటుకుంటున్నది. కూరగాయల నుంచి మొదలు గొర్రె పొట్టేళ్ల దాకా.. ప్లాస్టిక్ బకెట్ల నుంచి ఇంటి నిర్మాణ సామగ్రి దాకా.. ఎడ్లు, బర్రెల నుంచి ఇలా వ్యవసాయ పనిముట్ల దాకా.. ఇలా ఇక్కడ ప్రతి సరుకూ సరసమైన ధరకే దొరుకుతున్నది. దీంతో ప్రతి శనివారం ఊరంతా సందడి కనిపిస్తున్నది.
గంగాధర, జనవరి 23 : గంగాధర వారసంత అంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తెలియని వ్యాపారులు ఉండరు. ప్రతి శనివారం జరిగే ఇక్కడి అంగడికి కరీంనగర్‌తోపాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి వ్యాపారులు, రైతులు, వినియోగదారులు వస్తుంటారు. ఇందులో తాజా కూరగాయలు, పండ్లు, బట్టలు, ప్లాస్టిక్, ఇనుప వస్తువులు, సుగంధ ద్రవ్యాలు, తినుబండారాలు, చిరు ధాన్యాలు, చేపలు, రొయ్యలు, ఆట వస్తువులు, రైతులకు అవసరమైన చిన్న చిన్న వ్యవసాయ పనిముట్లను విక్రయిస్తుంటారు. ఇక్కడ పొద్దంతా క్రయవిక్రయాలు సాగించి చీకటి పడకముందే వారివారి ప్రాంతాలకు తిరిగివెళ్తుంటారు.
ఏడాదికి రూ. 1.34 కోట్ల ఆదాయం
1970లో గంగాధర వారసంత ప్రారంభమైంది. అప్పుడు గ్రామ పంచాయతీకి ఏడాదిలో రూ. 200 ఆదాయం రాగా, ఇప్పుడు రూ.1.34 కోట్ల ఆదాయం సమకూరుతున్నది. వేలంలో పాల్గొనే వారి సంఖ్య పెరుగడం, ఆర్థికంగా మేలు జరిగే అవకాశం ఉండడంతో వ్యాపారుల మధ్య పోటీతోపాటు ఆదాయం గణనీయంగా పెరిగింది. గంగాధర అంగడి వ్యాపార కేంద్రంగా మారడంతో ఎందరికో ఉపాధి లభిస్తున్నది. వస్తువులను నేరుగా వినియోగదారులకే విక్రయిస్తుండడంతో ఇటు వ్యాపారులు, అటు కొనుగోలుదారులకు మేలు జరుగుతున్నది.
పశువుల అమ్మకాలు ప్రత్యేకం
ఉమ్మడి జిల్లాలో ఎక్కడాలేని విధంగా గంగాధర వారసంతలో పశువులు, గొర్రెలు, మేకల విక్రయాలు జోరుగా సాగుతాయి. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, మెదక్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి వ్యాపారులు గంగాధర వారసంతకు వస్తుంటారు. పశువులను అమ్ముకొని సాయంత్రం కాగానే తిరిగి వెళ్తారు. ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడ సంతలు ఉన్నా.. వినియోగదారులు ఇక్కడికే ఎక్కువగా వస్తారు.
గ్రామాభివృద్ధిలో కీలకం
గంగాధర వారసంత ఉత్తర తెలంగాణలోనే పెద్దదిగా గుర్తింపు దక్కించుకున్నది. ఇతర రాష్ర్టాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వస్తుంటారు. గృహావసరాలకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. గంగాధర వారసంత ద్వారా వచ్చే ఆదాయం గ్రామాభివృద్ధ్దికి కీలకంగా మారింది. అనేక అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలు కలుగుతున్నది.