కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 7 : వినాయక నిమజ్జనోత్సవాన్ని ఈ నెల 9న సజావుగా.. శాంతియుతంగా పూర్తి చేయాలని అధికారులకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ, కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావుతో కలిసి వినాయక నిమజ్జన ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్లో ఏ పండుగ అయినా అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి సోదర భావంతో జరుపుకొంటారని తెలిపారు. శాంతి, సామరస్యానికి మారుపేరని, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా వినాయక నిమజ్జనాన్ని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా శాంతియుత వాతావరణంలో సంప్రదాయబద్ధంగా, అట్టహాసంగా జరుపుకోవాలని కోరారు. ఎకడైతే శాంతిభద్రతలు బాగుంటాయో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. కరీంనగరంలో ఏర్పాటు చేసిన వినాయకులను మానకొండూర్, కొత్తపెల్లి చెరువులు, చింతకుంట వద్ద కెనాల్లో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిమజ్జనం పాయింట్ల వద్ద బారీకేడ్లు, లైటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు.
ఒకో పాయింట్ వద్ద రెండు పెద్ద క్రేన్లు, ఒక చిన్న క్రేన్ ఏర్పాటు చేయాలని, గజ ఈతగాళ్లను మూడు షిప్టుల్లో నియమించాలని ఆదేశించారు. నిమజ్జన ప్రదేశాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉంచాలని, అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలన్నారు. నిమజ్జనానికి గ్రానైట్ యజమానులు క్రేన్లను ఏర్పాటు చేస్తారని తెలిపారు. వినాయకులు వెళ్లే రూట్లలో ప్రమాదాలు జరగకుండా విద్యుత్ లైన్లను పైకి లేపాలని విద్యుత్ అధికారులకు సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లు అరగంటకోసారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. చింతకుంట బ్రిడ్జ్ దగ్గర మరమ్మతులు చేపట్టాలని, రాత్రి ఒంటి గంట వరకు నిమజ్జనం పూర్తయ్యేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రత్యేకాధికారులను నియమించాం : కలెక్టర్
ప్రతి నిమజ్జన స్థలం వద్ద ఒక ప్రత్యేకాధికారిని నియమించామని కలెక్టర్ కర్ణన్ తెలిపారు. అన్ని నిమజ్జన స్థలాల్లో లైటింగ్, బార్కేడింగ్, క్రేన్లు, స్విమ్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనం రోజు జిల్లాలో వైన్‌షాపులు, బార్లు, బెల్ట్ షాపులను మూసి వేయించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని, నిమజ్జన స్థలాల్లో స్టాండ్ బై కింద జనరేటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
పకడ్బందీగా బందోబస్తు : సీపీ
శోభాయాత్రను భక్తిభావంతో ఆధ్యాత్మిక చింతనతో నిర్వహించుకోవాలని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ సూచించారు. కరీంనగర్ జిల్లాలో మొత్తం 3వేల గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేశారని, నగరంలో 800 నుంచి 900 పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిమజ్జనాన్ని శాంతియుతంగా జరిపేందుకు పకడ్బందీగా పొలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. వైషమ్యాలు పెంచేలా సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. అన్ని విగ్రహాలు వెళ్లే చౌరస్తాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే, మొబైల్ సీసీ కెమెరాలు ఉంటాయన్నారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం : మేయర్
గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు ఏర్పాట్లు చేసినట్లు నగర మేయర్ వై సునీల్‌రావు తెలిపారు. అన్ని రూట్లలో లైటింగ్, తాగునీరు, శానిటేషన్ చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూడు వినాయక నిమజ్జనం పాయింట్ల వద్ద అధికారులను నియమించినట్లు తెలిపారు. రోడ్లపై గుంతలకు మరమ్మతులు చేశామన్నారు. నిమజ్జనం తర్వాత చెరువుల్లో చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్, గరిమా అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ లెనిన్, డీఎంహెచ్‌వో జువేరియా, డీపీవో వీర బుచ్చయ్య, ట్రాన్స్‌కో ఎస్ఈ గంగాధర్, వివిధ మతాలకు చెందిన మత పెద్దలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.