కులవృత్తులకు జీవం పోస్తున్న రాష్ట్ర సర్కారు, గొల్లకుర్మల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా మొదటి విడుత గొర్రెల పంపిణీచేసి తాజాగా రెండో విడుత అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయగా, ఇదివరకే యంత్రాంగం రంగంలోకి దిగింది. అన్ని జిల్లాల్లోనూ అర్హుల జాబితాను సిద్ధం చేయగా, సిరిసిల్ల జిల్లాలోని 188 సంఘాల్లో 4,622 మందిని గుర్తించింది. ఎంపికైన వారిలో ఎవరైనా మృతిచెందినా.. ఉద్యోగం వచ్చినా కుటుంబ సభ్యులకు యూనిట్లు అందించనున్నది. త్వరలోనే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, కులస్తుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. కాగా, గతంతో పోలిస్తే ఇప్పుడు యూనిట్ విలువ పెరిగిందని, అందుకు అనుగుణంగా డీడీలు చెల్లించాలని యంత్రాంగం సూచిస్తున్నది.
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): జిల్లాలో గొల్ల కుర్మలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు పంపింది. ఉమ్మడి రాష్ట్రంలో నిరాధారణకు గురైన గొల్లకుర్మల ఆర్థికాభివృద్ధి కోసం జిల్లాలో మొదటి విడుత పంపిణీ చేసి అద్భుత ఫలితాలు చూడగా, రెండో విడుత పంపిణీ చేయాలని నిర్ణయించింది. మొదటి విడుత 2017-18లో 11,540 యూనిట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. అప్పుడు యూనిట్ విలువ రూ.1.25లక్షలు ఉండగా ప్రభుత్వం 75శాతం సబ్సిడీ పోను అదే కులస్తులు 25శాతం వాటాను డీడీల రూపంలో చెల్లించి 20గొర్రెలు, ఒక పొట్టేలుతో కూడిన యూనిట్‌ను తీసుకున్నారు. కాగా, రెండో విడత కోసం ఇప్పటికే పశు సంవర్ధక శాఖ అధికారులు జాబితాను సిద్ధం చేశారు. జిల్లాలోని 188 సొసైటీల్లో 4,622 మందిని అర్హులుగా గుర్తించారు. ఇటీవల రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి యూనిట్ల గ్రౌండింగ్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు యూనిట్ల గ్రౌండింగ్‌కు ముందుకు సాగుతున్నారు.
యూనిట్ విలువ పెంపు..
రాష్ట్రంలో మాంసం ధరలు పెరగడంతో ప్రభుత్వం మొదట నిర్ణయించిన మొత్తానికి ప్రస్తుతం 20గొర్రెలు, పొట్టేలు రావడం లేదు. మార్కెట్ ధరలకు అనుగుణంగా యూనిట్ ధర రూ.1.75లక్షలకు పెరిగింది. మొదటి దఫాలో ఎంపికై డీడీలు కట్టి యూనిట్లు అందని వారికి కూడా పెరిగిన యూనిట్ విలువ వర్తిస్తుందని, వారు కూడా పెరిగిన యూనిట్ విలువలో 25శాతం చెల్లించాలని అధికారులు సూచిస్తున్నారు. అంటే గతంలో కట్టిన డీడీలు పోను మరో రూ.12,500 చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తం చెల్లించిన వారికే ప్రస్తుతం యూనిట్లను అందజేయనున్నారు. రెండో దశకు ఎన్నికైన 4,622 మంది పెంచిన యూనిట్ విలువలో 25శాతం అంటే రూ.43,750 డీడీల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 75శాతం రూ.1,31, 250ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరించనుంది.
అర్హులు మృతిచెందితే కుటుంబసభ్యులకు యూనిట్లు
2017లో రెండో విడతలో సైతం గొర్రెల పంపిణీకి సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేయగా, వారిలో ఎవరైనా ఇటీవలి కాలంలో వృద్ధాప్యంతోనో, ఇతర అనారోగ్య కారణాలతో మృతి చెందినా, యువకులు ఉద్యోగాలు వచ్చి వెళ్లిపోయినా వారి స్థానంలో నామినీగా ఉన్న వారిని లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. కాగా, మొదటి విడతలో రాష్ట్రంలోని జిల్లాలకు మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్‌ఘడ్‌తో పాటు వివిధ రాష్ర్టాల నుంచి కొనుగోలు చేయాలని అధికారులు నిర్ధేశించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి తీసుకువచ్చారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేశారు.
గొర్రెలను కొనుగోలు చేసిన వెంటనే వాటికి జియోట్యాగింగ్ చేసి అవినీతి, అక్రమాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. రెండో విడతలో ఏ ప్రాంతం నుంచి కొనుగోలు చేయాలన్నది లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. కాగా, ఎంపిక చేసిన యూనిట్లలో తొలి విడుతగా, ఏ యూనిట్‌ను తీసుకెళ్లాలన్న అంశంపై కలెక్టర్ సమక్షంలో డ్రా తీయనున్నారు. డ్రాలో వచ్చిన యూనిట్ సభ్యులను కొనుగోలుకు అధికారులు వెంట తీసుకెళ్తారు. గొర్రెల పెంపకంలో యువతను ప్రోత్సహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 18 ఏండ్లు నిండిన యువకులకు సొసైటీలో సభ్యత్వం ఇప్పించి గొర్రెల యూనిట్‌కు ఎంపిక చేసి స్వయం ఉపాధి వైపు అడుగులు వేయిస్తున్నారు.
జీవాలకు వైద్య సేవలు
రాయితీపై అందిస్తున్న జీవాలకు ఎలాంటి వ్యాధులు వచ్చినా వెనువెంటనే వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం 1962 టోల్ ఫ్రీ నంబర్‌తో ప్రత్యేక వాహనాన్ని కేటాయించింది. లబ్ధిదారులు ఫోన్ చేసిన వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పశుసంవర్థక శాఖ సిబ్బంది ఉచితంగానే వైద్య సేవలందిస్తున్నది. ప్రతి నియోజకవర్గానికి ఒక సంచార వాహనం ఏర్పాటు చేసింది.