కరీంనగర్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): డెంగ్యూ నివారణకు కరీంనగర్ జిల్లా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాలు, పట్టణాలనే తేడా లేకుండా పలు ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. గత జనవరి నుంచి ఇప్పటి వరకు 183 పాజిటివ్ కేసులు నమోదుకాగా, జూన్ నుంచి ఈ కేసులు పెరుగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే 21 కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి వారం సమీక్ష నిర్వహించి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
మూడు నెలలుగా ప్రభావం..
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలను నిర్వహించింది. దీంతో వైరల్ ఫీవర్లు అదుపులోనే ఉన్నాయి. ప్రతి ఐదేళ్లకోసారి విజృంభిస్తున్న డెంగ్యూ ఇప్పుడిప్పుడే జిల్లాలో విస్తరిస్తున్నది. ముఖ్యంగా గడిచిన మూడు నెలల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. జనవరి నుంచి ఈ రోజు వరకు 183 పాజిటివ్ కేసులు నమోదు కాగా, గత జూన్ నుంచే డెంగ్యూ ప్రభావం కనిపిస్తున్నది. ఈ యేడాది జనవరిలో 13, ఫిబ్రవరిలో 1, మార్చిలో 5, ఏప్రిల్‌లో 20, మేలో 12 కేసులు మాత్రమే నమోదుకాగా జూన్‌లో 17, జూలైలో 33, ఆగస్టులో 61, ఈ నెలలోనే 21 కేసులు నమోదయ్యాయి. మొదటి నుంచి డెంగ్యూ జ్వరాలపై అప్రమత్తంగానే ఉన్న అధికారులు ఈ నెలలో వారం గడవక ముందే 21 కేసులు రావడంతో అప్రమత్తమయ్యారు. కరీంనగర్ పట్టణంలోని విద్యానగర్, సప్తగిరి కాలనీలో ఎక్కువ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే గంగాధర, చొప్పదండి మండలాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
యంత్రాంగం అప్రమత్తం..
డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ముందు నుంచి నివారణ చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెలలో వారంలోనే 21 కేసులు నమోదు కావడంతో ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఇప్పటికే ప్రతి శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షిస్తున్నారు. ఎప్పటికపుడు పరిస్థితిని తెలుసుకుంటూ చర్యలు చేపడుతున్నారు. గత ఆగస్టులో ఎక్కువ కేసులు పట్టణ ప్రాంతాల్లో అదీ కరీంనగర్‌లోనే నమోదు కావడంతో ఆయా ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు.
అంతే కాకుండా ఒక్క కరీంనగర్‌లోనే 105 బృందాలను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించడం, ఇండ్లు, కాలనీల్లోని పరిసరాలను పరిశీలించి అపరిశుభ్రంగా ఉంటే ప్రత్యక్షంగా పాల్గొని పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలతో నిలిచి పోయిన ఈ బృందాల సేవలను కలెక్టర్ పునరుద్ధరిస్తున్నారు. ఇక గ్రామాల్లో జిల్లా పంచాయతీ అధికారులు కూడా ఎప్పటికపుడు చర్యలు చేపడుతున్నారు. డెంగ్యూ ప్రబలకుండా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు, వైద్యాధికారులు, మున్సిపల్, పంచాయతీ వింగ్ అధికారులు గ్రామాలు, పట్టణాల్లో పర్యటిస్తున్నారు. కాగా, మంగళవారం జ్యోతినగర్‌లో నిర్వహించిన డ్రైడేలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
ప్రైవేట్ వైద్యంపై ప్రత్యేక నిఘా..
ఒక పక్క డెంగ్యూ నివారణ చర్యలు తీసుకుంటూనే మరో పక్క ప్రైవేట్ వైద్యంపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. ప్రైవేట్ దవాఖానాలు డెంగ్యూ నిర్ధారణ చేయరాదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రైవేట్ దవాఖానాలకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. ఎలిసా టెస్టు చేస్తే తప్పా డెంగ్యూ పాజిటివ్ కేసులు నిర్ధారించరాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానాలో కొత్తగా ఏర్పాటు చేసిన టీ హబ్ ల్యాబ్‌లో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎలిసా టెస్టులు నిర్వహించి నిర్ధారిస్తేనే డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. విష జ్వరాలతో తెల్ల రక్త కణాలు తగ్గిపోయిన రోగులకు ప్రైవేట్ దవాఖానాలు డెంగ్యూ భయం చూపి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైద్యాధికారులు ప్రతి రోజు ప్రతి ప్రైవేట్ దవాఖాన నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఏ దవాఖానలో ఎంత మంది జ్వరాలతో అడ్మిట్ అయ్యారు, ఎంత మంది డిస్చార్జి అయ్యారు. అడ్మిట్ అయిన వారి రోగ లక్షణాలు ఏమిటీ..? అనే వివరాలు ఎప్పటికపుడు తెప్పించుకుంటున్నారు.
జ్వర సర్వేకు ప్రణాళిక..
రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ ప్రభావం చూపుతున్న నేపథ్యంలో మున్సిపాలిటీల్లో జ్వరాల సర్వే నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్‌రావు ఆదేశించారు. అయితే జిల్లాలో గ్రామాలు, పట్టణాల్లో డెంగ్యూ కేసులు నమోదైన ప్రతి చోట ఎప్పటికపుడు జ్వరాల సర్వే నిర్వహిస్తున్నామని, రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా తెలిపారు. మంత్రి ఆదేశాలతో ప్రతి మున్సిపాలిటీలో రీ సర్వే నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, రెండు రోజుల్లో బృందాలను జ్వర సర్వేలకు దించుతామని ఆమె స్పష్టం చేశారు. అయితే జ్వరాల సర్వేతోపాటు ప్రజల్లో డెంగ్యూపై అవగాహన పెంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నీరు నిల్వ ఉన్నచోట గంబూషియా చేపలను వదిలేందుకు ఇప్పటికే రెండు సార్లు ఆయా పీహెచ్‌సీలకు వీటిని సరఫరా చేశారు.
డేంజర్‌గా మారిన కూలర్లు..
డెంగ్యూ దోమలు ప్రబలడానికి ఎక్కువగా కూలర్లు దోహదపడుతున్నాయని అధికారులు గుర్తించారు. పొద్దంతా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32, 33 డిగ్రీలు ఉంటున్న నేపథ్యంలో ఉక్కపోత విపరీతంగా ఉంటున్నది. ఈ నేపథ్యంలో ఇపుడు చాలా మంది కూలర్లు వాడుకుంటున్నట్లు, ఈ కూలర్లలో డెంగ్యూ దోమలు వృద్ధి చెందుతున్నట్లు డీఎంఅండ్‌హెచ్‌వో జువేరియా తెలిపారు. సహజంగా మంచి నీటిలో పెరిగే డెంగ్యూ దోమ పొద్దంతా కుడుతుందని, ఈ విషయంలో చాలా మందికి అవగాహన ఉన్నప్పటికీ కూలర్లలో వాడుతున్న నీటిని క్లీన్ చేసుకోవడం లేదని అన్నారు. దీంతో కూలర్లలో డెంగ్యూ దోమలు వృద్ధి చెందడానికి ఎక్కువగా ఆస్కారం ఉందని వైద్యాధికారి చెబుతున్నారు. కూలర్లు వాడితే ఎప్పటికప్పుడు నీటిని తొలగించి దోమలు వృద్ధి కాకుండా చూసుకోవాలని ఆమె సూచిస్తున్నారు. నిరుటితో పోల్చుకుంటే ఈ సారి డెంగ్యూ కేసులు తగ్గాయని, ఎవరు కూడా మరణించ లేదని ఆమె పేర్కొన్నారు.