కలెక్టరేట్, సెప్టెంబరు 6: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జల సంరక్షణ చర్యలు బాగున్నాయని జలశక్తి అభియాన్ బృంద సభ్యులు నరేంద్రకుమార్, ప్రభాత్చౌహాన్ ప్రశంసించారు. జలశక్తి అభియాన్ బృందం మొదటి రోజైన మంగళవారం జిల్లాలోని పలు గ్రామాల్లో క్షేత్ర పరిశీలన చేసింది. అనంతరం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ బీ సత్యప్రసాద్, అధికారులతో సమావేశమయ్యారు. డీఆర్డీఏ, అటవీ, భూగర్భ జలశాఖ, మిషన్ భగీరథ, మున్సిపల్ శాఖ అధికారులు జల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బృంద సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా చెరువుల పునరుద్ధరణ, పునర్వినియోగం, రీచార్జి గుంతల నిర్మాణం, వాటర్షెడ్ల అభివృద్ధి లాంటి పథకాలు బాగున్నాయని అభినందించారు.
మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్ట్, హరితహారం తదితర కార్యక్రమాలు జలసంరక్షణతోపాటు భూగర్భ జలాలు పెరిగేందుకు దోహదపడతాయన్నారు. అధికారులు, ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో జలసంరక్షణకు కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు బృందం సభ్యులు తంగళ్లపల్లి మండలం జిల్లెలలో జలశక్తి అభియాన్ కింద చేపడుతున్న పనులను పరిశీలించారు. సిరిసిల్లలో డ్రై రీసోర్సెస్ సెంటర్లో ఉన్న ఫిజికల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ)ను, ఫిల్టర్బెడ్ను పరిశీలించారు. రెండోరోజూ బుధవారం ఎల్లారెడ్డిపేట మండలంలో జలశక్తి అభియాన్ బృంద సభ్యులు పర్యటించనున్నారు. సమావేశంలో అదనపు డీఆర్డీవో మదన్మోహన్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.