జగిత్యాల, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): పల్లెలను మరింత పరిశుభ్రంగా.. ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది, స్వచ్ఛతలో జగిత్యాల జిల్లాను ముందు నిలిపేందుకు యంత్రాంగం సరికొత్త కార్యక్రమం చేపట్టింది. కేంద్ర పురస్కారాల్లో ఉత్తమ ర్యాంక్ సాధనే లక్ష్యంగా కసరత్తు మొదలుపెట్టింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా గతంలో ఎంపిక చేసిన 122 ఓడీఎఫ్ గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్‌గా గుర్తించి, ఆ గ్రామాల్లో సమగ్ర అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గత నెల 30న సర్వే మొదలు పెట్టింది. పది రోజుల డ్రైవ్ అనంతరం నివేదికను పోర్టల్‌లో పొందుపరచనున్నది. దీని ఆధారంగానే కేంద్ర బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ర్యాంకులు ఇవ్వనుండగా, యంత్రాంగం పకడ్బందీగా ముందుకు సాగుతున్నది.
ఓడీఎఫ్ ప్లస్ అంటే..
ఓడీఎఫ్ అంటే బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా పేర్కొంటారు. ఓడీఎఫ్ ప్లస్ అంటే మలవిసర్జన రహితంతో పాటు, ఇంటింటికీ సంబంధించిన స్వచ్ఛతను పరిగణలోకి తీసుకుంటారు. ఓడీఎఫ్ ప్లస్‌గా ఎంపికైన గ్రామాల్లో ఇంటింటికీ మరుగుదొడ్డి, ఇంకుడు గుంతల వినియోగం, చెత్త తరలింపు, వినియోగం, మురుగునీటి పారుదల తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత ఉన్నదా..? మురుగునీరు బయటకు వెళ్లేందుకు కాలువలు ఉన్నాయా..? చెత్త సేకరణ జరుగుతున్నదా..? చెత్త సేకరణకు సంబంధించి తడిచెత్త, పొడిచెత్త వేరు చేసేందుకు బాక్స్‌లు ఇచ్చారా..? లేదా..? వీధుల్లో చెత్త వేసేందుకు కుండీల ఏర్పాటు జరిగిందా..? లేదా..? చెత్త సేకరణ, డంపింగ్ తదితర అంశాలన్ని ఉన్నాయా..? అన్న విషయాన్ని పరిశీలించే కార్యక్రమం మొదలు పెట్టారు.
జంబ్లింగ్ పద్ధతిలో బృందాలు..
మండలాల వారీగా ఎంపిక చేసిన ఓడీఎఫ్ ప్లస్ మోడల్ గ్రామాల్లో సర్వేకు సంబంధించిన సిబ్బందిని జంబ్లింగ్ పద్ధతిలో వినియోగిస్తున్నారు. మండల స్థాయిలో ఎంపీడీవో, ఎంపీవో, ఎంఈవో, ఏపీవో, ఏపీఎం ఆధ్వర్యంలో బృందంతో సర్వే చేయిస్తున్నారు. నరేగా ఫీల్డ్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీల్లోని మల్ట్టీపర్పస్ వర్కర్లు, సర్వేలో పాల్గొంటున్నారు. ఏ మండలానికి సంబంధించిన సిబ్బందితో కూడిన బృందాన్ని ఆ మండలానికి కేటాయించకుండా, క్షేత్రస్థాయి సత్యాలు పక్కాగా తెలుసుకునేందుకు బృందాలు, అధికారులను జంబ్లింగ్ చేశారు. ఒక మండలానికి చెందిన బృందానికి మరో మండలంలో సర్వే చేసే బాధ్యతలను అప్పగించారు.
జిల్లాలో 122 గ్రామాల్లో పరిశీలన..
జిల్లాలో 18 మండలాల పరిధిలో 380 గ్రామాలుండగా, అందులో 122 గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా గతేడాది గుర్తించారు. ఈ గ్రామాల్లో అధ్యయనం చేసేందుకు 18 బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి మండలానికి ఒక బృందం ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇందులో ఎంపీడీవోతో పాటు మండల స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. వీరి నేతృత్వంలో గ్రామాల్లో నలుగురైదుగురు సిబ్బందితో బృందాన్ని ఏర్పాటు చేసి, అధ్యయనం చేయిస్తున్నారు. బీర్పూర్ మండలంలో 4, బుగ్గారం మండలంలో 7, ధర్మపురిలో 11 గొల్లపల్లిలో 4, ఇబ్రహీంపట్నంలో 4, జగిత్యాల అర్బన్‌లో 4, జగిత్యాల రూరల్‌లో 11, కథలాపూర్‌లో 5, కొడిమ్యాలలో 11, కోరుట్లలో 7, మల్లాపూర్‌లో 6, మల్యాలలో 3, మేడిపల్లిలో 8, మెట్పల్లిలో 10, పెగడపల్లిలో 5, రాయికల్‌లో 5, సారంగాపూర్‌లో 7, వెల్గటూర్‌లో 9 గ్రామాలను ఎంపిక చేశారు. మొత్తంగా జిల్లా పరిధిలో 122 గ్రామాల్లోని 50,970 ఇండ్ల పరిధిలో సర్వే నిర్వహించనున్నారు. జిల్లా పరిధిలో దాదాపు 2.60 లక్షల మంది ప్రజలను ఈ సర్వేలో భాగస్వామ్యం చేయనున్నారు.
పది రోజుల పాటు సర్వే..
జిల్లాలో ఎంపికైన గ్రామాల్లో పది రోజుల పాటు సర్వే నిర్వహించనున్నారు. గత నెల 30న ఈ అధ్యయనం ప్రారంభమైంది. పరిశీలన పూర్తయిన తర్వాత కలెక్టర్‌కు నివేదిస్తారు. తదుపరి వివరాలను స్వచ్ఛ భారత్ మిషన్ పోర్టల్‌లో పొందుపరుస్తారు. ఇది జరిగిన రెండు మూడు నెలలకు కేంద్ర నియమించిన థర్డ్ పార్టీ అధ్యయన బృందాలు జిల్లాలకు చేరుకొని పరిశీలిస్తాయి. స్వచ్ఛత ప్రమాణాల ఆధారంగా గ్రామాలకు ర్యాంకింగ్‌లు, అవార్డులు, ప్రోత్సాహకాలు మంజూరవుతాయి.
సర్వేలో పరిశీలిస్తున్న అంశాలు..
ప్రతి ఇంటిలో ఉన్న మరుగుదొడ్డి వాడుతున్నారా లేదా..? కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆరుబయట మల విసర్జన చేస్తున్నారా..? బహిరంగ మల విసర్జనకు వెళ్తుంటే అందుకు కారణాలు ఏంటి?
ఉమ్మడి కుటుంబంలో మరుగుదొడ్డి ఉన్నదా..? వ్యక్తుల వారీగా మరుగుదొడ్డి ఉన్నదా?
మరుగుదొడ్డి వ్యర్థపు నీటిని సెప్టిక్ ట్యాంకులోకి అనుసంధానం చేసుకున్నారా..? లేదా..? వ్యర్థపు నీటి పైపులైన్‌ను మురుగు కాలువకు కలిపారా..? కలిపితే మురుగు కాలువ నీటిని ఎక్కడికి పంపిస్తున్నారు?
ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మాణం చేశారా లేదా..? వర్షపు నీరు గుంతలోకి చేరుతున్నదా..? సెప్టిక్ ట్యాంక్ వ్యర్థపు నీటిని ఇంకుడు గుంతలోకి తరలిస్తున్నారా..?
తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారా..? తడి చెత్తను ఇంట్లో సేంద్రియ ఎరువుగా వాడుతున్నారా..? ద్రవ పదార్థాలను ఇంకుడు గుంతకు మరల్చుతున్నారా..? సురక్షిత పద్ధతిలో ద్రవ వ్యర్థాలను బయటకు పంపుతున్నారా..? లేదా..?
పంచాయతీల్లో గోడలపై ఐదుకు తగ్గకుండా చైతన్యవంతమైన వాల్ పెయింటింగ్స్ ఉన్నాయా లేవా..?
ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో పారిశుధ్యం, మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగం ఎలా ఉంది? ఇంకుడు గుంతల నిర్మాణం జరిగిందా..? వాటి వినియోగం జరుగుతుందా..?