బాలికల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. బాలురతో సమానంగా అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. మెరుగైన విద్యనందించేందుకు సర్కారు బడులను బలోపేతం చేస్తున్నది. ఇందులో భాగంగా రుద్రంగి మండల కేంద్రంలో కస్తూర్బాగాంధీ విద్యాలయం కోసం రూ.3.50 కోట్లతో జీ+2 విధానంలో నూతన భవనాన్ని నిర్మించడంతో పాటు ఆటస్థలం, అదనపు తరగతి గదులు, ల్యాబ్, లైబ్రరీ కోసం ఏర్పాట్లు చేస్తున్నది. ఆధునిక హంగులతో భవనం అందుబాటులోకి రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతోంది. -రుద్రంగి, సెప్టెంబర్ 6
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతనంగా ఏర్పడిన రుద్రంగి మండలంలో కేజీబీవీకి సొంత భవనం లేకపోవడంతో అద్దె భవనంలో కొనసాగించారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు 208 మంది విద్యార్థినులు చదువుతున్న ఈ విద్యాలయంలో హాస్టల్ వసతి, విద్యా బోధనకు సరిపడా గదులు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆయన స్పందించి, నూతన భవనం కోసం ప్రతిపాదనలు పంపించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ మేరకు రూ.3 కోట్ల 50 లక్షలు మంజూరు చేయించడంతో పాటు నిర్మాణ పనులు వేగంగా జరిగేలా ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టిసారించారు. ప్రస్తుతం భవనం పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇది పూర్తయితే మండలంలోని గ్రామాలతోపాటు ఇతర దూర ప్రాంతాల నుంచి వచ్చే బాలికలకు ప్రయోజనం చేకూరనున్నది. భవనంతో పాటు విశాలమైన ఆట స్థలం, అదనపు తరగతి గదులు, ల్యాబ్, లైబ్రరీ, తదితర ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ఇన్నాళ్లు పడ్డ కష్టాలు ఇక తీరనుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులు వినియోగించుకోవాలి
కస్తూర్బా గాంధీ విద్యాలయం కోసం అన్ని వసతులతో భవన నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు అద్దె భవనంలో పాఠశాలను కొనసాగిస్తున్నాం. విద్యా బోధనతోపాటు వసతికి సరిపడా గదులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ భవనం ప్రారంభమైతే ఇవన్నీ తొలగిపోతాయి. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు వినియోగించుకోవాలి.
– మంకు వనిత, కేజీబీవీ ప్రత్యేకాధికారి
త్వరలోనే అందుబాటులోకి తెస్తాం
రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.3.50 కోట్ల నిధులతో అన్ని హంగులతో భవన నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేస్తున్నం. త్వరలోనే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో విద్యార్థులకు అందుబాటులోకి తెస్తాం.
– శ్రీకాంత్, సోషల్ వెల్ఫేర్ ఏఈ (రుద్రంగి)