కోల్సిటీ, సెప్టెంబర్ 6: ఖనిలో చేనేత, హస్తకళా మేళాకు విశేష ఆదరణ లభిస్తున్నది. చేనేత హస్త కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా హైదరాబాద్లోని శ్రీ ఉషోదయ చేనేత హస్త కళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్జీ-1 కమ్యూనిటీ హాల్లో కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ శిబిరంలో దేశంలోని సుమారు ఆరు రాష్ర్టాలకు చెందిన కళాకారులు తయారు చేసిన వస్తువులను ప్రదర్శిస్తూ నేరుగా విక్రయిస్తున్నారు.
ప్రతి రోజూ ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల దాకా మేళా జరుగుతుండగా, ఇందులో ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్నాటక, జైపూర్, న్యూఢిల్లీ తదితర రాష్ర్టాల్లోని కళాకారులు రూపొందించిన వివిధ రకాల కళాత్మక వస్తువులు, వస్ర్తాలు స్థానికులను ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ నెల 18వ తేదీ వరకు మేళా కొనసాగుతుందని నిర్వాహకులు శనిగరం కిశోర్, జే సత్యనారాయణ తెలిపారు. కళాకారులతో నేరుగా అమ్మకం చేస్తున్నట్లు తెలిపారు. హస్తకళలను ఆదరించి చేనేతను ప్రోత్సహించే ఉద్దేశంతో రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా ఈ మేళా నిర్వహిస్తున్నామని, సింగరేణి కార్మిక క్షేత్రంలో విశేష స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా ఇవే..
మేళాలో చేనేత వస్త్రంతోపాటు హస్తకళలు, తినుబండారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పోచంపల్లి బెడ్ షీట్లు, శారీస్, కళంకారి, మంగళగిరి చేనేతలు, పొందూరు చేబ్రవోలు ఖాదీ వస్ర్తాలు, తమిళనాడు చెడ్డినాడు చీరలు, హైదరాబాద్ బంజారా ఉత్పత్తులు, హర్యానా సోఫా కట్వర్క్స్, చిన్నారుల వస్ర్తాలకు ఆదరణ లభిస్తున్నాయి. అలాగే కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, హైదరాబాద్ ముత్యాలు, ఖాదీ గ్రామోద్యోగ్ ఆయుర్వేద ఔషధాలు, లెడర్ బ్యాగులు, ఇమిటేషన్ జువెల్లరి, గృహ ఉపకరణ వస్తువులు, మైసూర్ రోజ్ఫుడ్, వివిధ రకాల పుస్తకాలు, కళాత్మక ఆభరణాలు, బ్యాంగిల్స్, బ్రాస్ నగిషీలతోపాటు మరెన్నో వస్తువులు ఆకట్టుకుంటుండగా, కొనుగోలు చేసేందుకు కోల్బెల్ట్ ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
చేనేత కళాకారులను ఆదరించాలి..
– జెల్ల సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షుడు
చేనేత, హస్తకళ కళాకారులను ఆదరించాలి. శ్రీ ఉషోదయ చేనేత సొసైటీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాం. ఏడాది పొడవునా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను ఎంచుకొని ఈ మేళాను నిర్వహిస్తుంటాం. రాష్ట్రంలో మంచి ఆదరణ ఉంటుంది. అందునా కోల్బెల్ట్ పారిశ్రామిక ప్రాంతమైన గోదావరిఖనిలో తమ ఉత్పత్తులను ఎంతోమంది ఆదరిస్తుంటారు.