కార్పొరేషన్/ కరీంనగర్ రూరల్, సెప్టెంబర్ 5 : స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు పెద్దదిక్కు అయ్యారని, గ్రామీణ కులవృత్తులను అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షే మ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. కాంగ్రెస్, బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని, వారి పాలనలో కష్టాలు, కన్నీళ్లు తప్పా ఏమీ లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌తో కలిసి సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో విస్తృంగా పర్యటించారు. ముందుగా ఎల్ఎండీ జలాశయంలోని గంగమ్మ దేవాలయం వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో వంద శాతం ఉచితంగా 40వేల కట్ల చేపపిల్లలు, 50 వేల రవ్వులు, 10వేల మ్రిగాల చేపపిల్లలను విడుదల చేశారు. అనంతరం కిసాన్‌నగర్‌లో శ్మశానవాటిక అభివృద్ధి పనులను ప్రారంభించారు. నగరపాలక సంస్థ రెండో అంతస్తులో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణను ప్రారంభించారు.
ఆ తర్వాత జడ్పీ ఆడిటోరియంలో 133 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు 1.33 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాక ముందు తాగునీటి కోసం యుద్ధం చేసిన పరిస్థితుల నుంచి రాష్ట్ర ఏర్పాటు అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో నీలి విప్లవం సాధించామన్నారు. మండుటెండల్లో సైతం చెరువులు మత్తడులు దుకుతున్నాయని తెలిపారు. గతంలో చేపల పిల్లలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే వారిమని, ఇప్పుడు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం కావాలన్న ఆలోచనతోనే కరీంనగర్ జిల్లాలోని 897 చెరువుల్లో సుమారుగా 2.30 కోట్ల చేపపిల్లలను పూర్తి ఉచితంగా విడుదల చేస్తున్నామన్నారు. గతంలో కాంగ్రెస్, బీజేపీ పాలకులు ఏ వర్గాలను పట్టించుకోలేదని విమర్శించారు. గతంలో ఆడబిడ్డల పెండ్లిళ్ల కోసం తల్లిదండ్రులు ఉన్న భూములను కుదువ పెట్టి, అమ్మినా.. సాయం అందించాలనే ఆలోచన గత పాలకులకు రాలేదని మండిపడ్డారు.
కానీ, సీఎం కేసీఆర్ ఓ అన్నగా, మేనమామగా నిరుపేద ఆడబిడ్డలకు అండగా ఉండాలని కల్యాణలక్ష్మి పథకాన్ని అమలులోకి తెచ్చారని, లక్ష నూటపదహార్లు సాయం అందిస్తున్నారని కొనియాడారు. దేశంలోని ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. పేదల కోసం సంక్షేమ పథకాల అమలు చేయడం ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు. పేదల కోసం ఆలోచించే కేసీఆర్ నిండు నూరేళ్లూ ఉండాలని ఆడబిడ్డలందరూ ఆశీర్వదించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ కార్పొరేట్‌కు దీటుగా స్మార్ట్ తరగతి గదులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్మార్ట్‌సిటీలో భాగంగా తెలంగాణలోనే తొలిసారి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 12 రకాల సేవలందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అందులో భాగంగా నగరంలోని 52 ప్రభుత్వ పాఠశాలల్లోని 104 తరగతి గదులను డిజిటల్ తరగతి గదులుగా మార్చుతున్నామన్నారు. నగరంలో ఏది జరిగిన క్షణాల్లో తెలిసే విధంగా ప్రజల భద్రత కోసం 17 ప్రాంతాల్లో 335 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
వాతావరణ పరిస్థితులతో పాటు ఇతర సమాచారాన్ని కూడా ప్రజలకు త్వరితగతిన చేరవేసేందుకు నగరంలోని 40 ప్రధాన కూడళ్లలో మైక్ సిస్టంను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. నగరంలోని 150 ప్రాంతాల్లో ఫ్రీ పబ్లిక్ వైఫై సేవలను తీసుకువస్తున్నామన్నారు. ఆయాచోట్ల కార్యక్రమాల్లో కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సుడా చైర్మన్, మేయర్ వై సునీల్‌రావు, టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జిల్లా మత్స్యశాఖ అధికారి దేవేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, ఐలేందర్ యాదవ్, తోట రాములు, గంట కళ్యాణి, గుగ్గిళ్ల జయశ్రీ, బోనాల శ్రీకాంత్, జంగిలి సాగర్, గందె మాధవి, చొప్పరి జయశ్రీ, నాయకులు చల్ల హరిశంకర్, ఆకుల సర్సయ్య, గంగాధర కనుకయ్య, పిట్టల రవీందర్, శ్రీనివాస్, వంగల పవన్, వేణు పాల్గొన్నారు.