గంగాధర, సెప్టెంబర్ 5 : రాష్ట్ర ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టే కేసీఆర్ కావాలని, సున్నం పెట్టి కడుపులు మాడ్చే మోదీ కాదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్ విజ్ఞప్తి స్పష్టం చేశారు. తెలంగాణపై కేంద్రం అడుగడుగునా విషం చిమ్ముతున్నదని, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కేంద్రం ఓర్వలేక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ సర్కా రును నమ్మవద్దని, నిరుపేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి సోమవారం కరీంనగర్లో పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. అనంతరం గంగాధర మండ లం మంగపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆసరా పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంటే, కేంద్రం మాత్రం ఆ పథకాలకు వ్యయం చేసే డబ్బును దండుగ అంటున్నదని దుయ్యబట్టారు. అయినప్పటికీ అన్ని పథకాలను కొనసాగించేందుకు ఎంతకైనా తెగిస్తామని, చివరకు కోర్టులోనూ కొట్లాడతామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి మానవత్వం ఉన్నాదా.. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆసరాగా నిలబడాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఆడపిల్ల పుడితే బాధపడే రోజును దూరం చేయాలని ఉద్యమ కాలంలోనే అనుకున్నామని, అందులో భాగంగానే కల్యాణలక్ష్మి పథకాన్ని తెచ్చామని చెప్పారు. ఆడబిడ్డ పెళ్లికి మొదట్లో రూ. 50 వేలు, తర్వాత రూ.75 వేలు, ఇప్పుడు రూ.లక్షా నూటాపదహార్లు కులమతాలకు అతీతంగా అందిస్తున్నామన్నారు.
అభ్యాగులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆసరా పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వమని, నిరుపేదల కోసం పాటుపడే ప్రభుత్వమని, సంక్షేమ పథకాలను అమలు చేసి తీరుతామని తెలిపారు. తెలంగాణలోని పది మండలాల్లో ఇస్తున్న పింఛన్లలో సగం కూడా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను గురించి గల్లీ గల్లీ తిరుగుదామని, చైతన్యం ఎవరిదో తెలుస్తుందని సవాల్ విసిరారు. కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఎంపీపీ శ్రీరాం మధుకర్, జడ్పీటీసీ పుల్కం అనురాధ, సింగిల్ విండో చైర్మన్లు దూలం బాలగౌడ్, వెలిచాల తిర్మల్‌రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు తదితరులు పాల్గొన్నారు.