రాంనగర్, సెప్టెంబర్ 5 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముకరంపుర ప్రాంతంలో బ్యాంకు నుంచి రూ.15 లక్షలు తీసుకొని వెళ్తున్న వ్యక్తులను వెంబడించిన ఇద్దరు అగంతకులు బ్యాగు లాక్కొని పరారైన ఘటన సంచలనం రేపింది. పోలీసుల కథనం మేరకు.. సాయివాణి ఆర్ఎంసీ ప్రైవేట్ లిమిటెడ్లో పని చేసే ఉద్యోగులు రామగిరి చంద్రప్రకాశ్, బండ మల్లారెడ్డి ఆఫీస్ అవసరాల కోసం కలెక్టరేట్ ఎస్బీఐ బ్యాంకుకు వచ్చారు. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో రెండు చెక్కుల ద్వారా రూ.15 లక్షలు డ్రా చేసుకుని ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ముకరంపురలోని పద్మనాయక రోడ్డులో వెళ్తుండగా వెనుక నుంచి మెరుపు వేగంతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెంబడించి చంద్రప్రకాశ్ చేతిలో ఉన్న డబ్బుల బ్యాగును లాక్కొని అంతే వేగంగా పారిపోయారు. రామగిరి చంద్రప్రకాశ్, బండ మల్లారెడ్డి వారిని వెంబడించినా ఆచూకీ దొరకలేదు. దీంతో టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మొన్న కామారెడ్డి.. నిన్న సిద్దిపేట.. నేడు కరీంనగర్
దోపిడీ జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లోని వ్యాపార సముదాయాల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అగంతకులను గుర్తించి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బ్యాంకులోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఆ అగంతకులు బ్యాంకు వద్ద కూడా రెక్కీ నిర్వహించినట్లుగా గుర్తించారు. బాధితులు డబ్బు డ్రా చేసుకుని వెళ్తుండటం గమనించే వారిని వెంబడించి దోపిడీ చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై నిందితులను పట్టుకునేందుకు అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించగా, ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. ఈ నిందితుడు ఆదివారం సిద్దిపేటలోనూ ఇదే తరహాలో దోపిడీకి పాల్పడినట్లు, మూడు రోజుల క్రితం కామారెడ్డిలోనూ ఇలాంటి నేరాలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. నిందితులు స్థానికులు కాకపోయి ఉండవచ్చని, పథకం ప్రకారం బ్యాంకుల వద్ద రెక్కీ నిర్వహించి ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.