బోయినపల్లి, సెప్టెంబర్ 4 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి పనులతో వరదవెల్లి ఆర్అండ్ఆర్ కాలనీ కళకళలాడుతున్నది. పల్లెప్రగతికి కింద మంజూరైన నిధులతో సర్పంచ్ ఆరెపల్లి లత గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. పల్లె ప్రగతిలో వరదవెల్లి ఆదర్శంగా నిలువడంతో ఆ గ్రామ పంచాయతీని అధికారులు ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక చేయడంతో ఆగస్టు 15న జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ సర్పంచ్ ఆరెపల్లి లతకు ప్రశంసాపత్రం అందించారు. పల్లె ప్రగతికి మంజూరైన నిధులను ప్రజల సహకారంతో సర్పంచ్, వార్డు సభ్యులు సమష్టిగా మురుగు కాలువలు, రహదారులు, డంప్ యార్డు, వైకుంఠధామం నిర్మించారు. పల్లె ప్రకృతి, పల్లె బృహత్ ప్రణాళిక ఏర్పాటు చేశారు. వంద శాతం శానిటేషన్ పూర్తి చేశారు. ముఖ్యంగా ఇంటి పనులు కూడా పూర్తిగా వసూలు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వరదవెల్లి అన్ని విధాలుగా అభివృద్ధిలో ఉండడంతో ఆ గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీ ఎంపిక చేయగా మంత్రి కేటీఆర్ ప్రశంసపత్రం అందించారు.
హరితమయం.. ఆర్అండ్ఆర్ కాలనీ
వరదవెల్లి ఆర్అండ్ఆర్ కాలనీ పూర్తిగా హరితమయమైంది. వరదవెల్లి ఆర్అండ్ఆర్ కాలనీ వరదవెల్లి నుంచి కొదురుపాక అడ్డ రహదారి వరకు రోడ్డుకు రెండు వైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. దారిపొడవునా ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. దీంతోపాటు గ్రామంలో వాడవాడనా నాటిన మొక్కలతో పచ్చదనం వెల్లివిరుస్తున్నది.
ఉత్తమ జీపీగా ఎన్నికవడం ఎంతో సంతోషం
వరదవెల్లి ఆర్అండ్ఆర్ కాలనీ ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక కావడం, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. పల్లె ప్రగతి నిధులతో గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికతో పాటు అభివృద్ధి పనులకు సహకరించిన ఎంపీపీ వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య, ఎంపీడీవో నల్ల రాజేందర్రెడ్డి, ఎంపీవో గంగాతిలక్కు, గ్రామస్తులు వార్డు సభ్యులకు కృతజ్ఞతలు.
–ఆరేపల్లి లత, సర్పంచ్ (వరదవెల్లి)