మంచిర్యాల, మార్చి 12(నమస్తే తెలంగాణ) : సింగరేణి అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం శాసనసభలో సింగరేణి అస్థిత్వం, మైన్స్ అమ్మకంపై కేంద్రం కుట్ర గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అనుమానాలను నివృత్తి చేయాలని సంబంధిత మంత్రిని అధ్యక్షుల ద్వారా కోరారు. సింగరేణిని కాపాడేందుకు, మైన్స్‌ను బతికించేందుకు, సింగరేణికే బొగ్గు బ్లాకులు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దిశానిర్దేశం తెలుపాలని బాల్క సుమన్ అడిగారు. ఆ దిశగా తీసుకుంటున్న చర్యలపై సంబంధిత మంత్రి ద్వారా తెలుపాలని కోరారు. నాలుగు బ్లాక్‌ల వేలంతో అయిపోదని, మిగతా 14 బ్లాకులు కూడా దక్కవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే జరిగితే సింగరేణి ఘోరంగా నష్టపోతుందని, అందుగురించి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో తెలుపాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అమ్మకానికి పెడుతున్నదని, దీంతో ప్రజానీకానికి, ప్రజాప్రతినిధులకు సింగరేణిపై కూడా భయం వేస్తున్నదన్నారు.
ఆంధ్రపదేశ్‌లో ఐరన్ ఓర్ మైన్స్ తమకు కావాలని విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులు, యాజమాన్యం 27 సార్లు దరఖాస్తు చేసుకుంటే వాళ్లకు ఐరన్ ఓర్ మైన్స్ ఇవ్వకుండా దాన్ని నష్టాల బాట పట్టించిందని, ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారని గుర్తుచేశారు. ఇక్కడ సింగరేణిని కూడా నష్టాల పాలుజేసి అమ్మకానికి పెడుతారేమోనని అనుమానం వస్తున్నదన్నారు. కేంద్రం విధానమే అమ్మకమని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడమే పనని, ఈ నేపథ్యంలో సింగరేణిని బతికించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పేర్కొనాలని విప్ కోరారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు వివరించాలన్నారు. ఇప్పటి వరకు ఏడేండ్ల కాలంలో సింగరేణి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటో పేర్కొనాలని విజ్ఞపి చేశారు. సింగరేణికి వందేండ్ల చరిత్ర ఉందని, ఆ సంస్థకు సంబంధించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. సింగరేణి ప్రాంతం నుంచి వచ్చే డీఎంఎఫ్ నిధులు పెద్ద ఎత్తున వస్తున్నాయని, వాటిని కూడా కోల్ బెల్ట్ ప్రాంతంలోనే అధికంగా ఖర్చు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. సింగరేణిని బతికించుకోవడమంటే తెలంగాణ అస్థిత్వాన్ని బతికించుకోవడం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడమని, రాష్ర్టాన్ని కాపాడుకోవడమని భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ కోణంలో ఇవేవీ కాంగ్రెస్, బీజేపీలకు అర్థం కావని పేర్కొన్నారు. అందుకే రాష్ట్ర అధ్యక్షుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.