పెద్దపల్లి, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ) : ఆహారభద్రత కార్డులు కలిగి ఉండి, ఆరోగ్యశ్రీ పథకం పొందేందుకు ఇబ్బందులు పడుతున్న వారికి రాష్ట్ర సర్కారు తీపి కబురు అందించింది. ఇకపై ఆహారభద్రత కార్డుదారులకు సైతం ఆరోగ్యశ్రీ సేవలు వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నది. అనారోగ్యానికి గురైన బాధితులు ఆరోగ్యశ్రీ ద్వారాప్రైవేట్ దవాఖానల్లో వైద్య సేవలు పొందాలంటే ఆరోగ్యశ్రీ కార్డు, పాత రేషన్ కార్డులు ఉంటేనే చేస్తున్నారు. అయితే, ఆరోగ్యశ్రీ కార్డులతో పాటు రేషన్ కార్డుల జారీ చేయడం జరగలేదు. వాటి స్థానంలో ప్రభుత్వం ఆహారభద్రత కార్డులను జారీ చేసింది.
దీంతో ఈ కార్డు కలిగి ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో అనారోగ్యానికి గురైన బాధితులు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలను పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్హులైన నిరుపేదలు జిల్లా ఉన్నతాధికారులను సంప్రదించి ఆరోగ్యశ్రీ వైద్యసేవల కోసం ప్రత్యేకంగా ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి వచ్చేది. అది కూడా సకాలంలో అందకపోవడం, ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో ఆహార భద్రత కార్డుదారులు సకాలంలో వైద్యం పొందలేని పరిస్థితి ఉండేది. సమస్యను తెలుసుకున్న ప్రభుత్వం ఫుడ్‌సెక్యూరిటీ కార్డుదారులకు ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకోగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరనున్నది. పెద్దపల్లి జిల్లాలో 2.10లక్షల కార్డుదారుల కుటుంబాల్లోని 6.10లక్షల మందికి ప్రయోజనం కలుగనున్నది.
సద్వినియోగం చేసుకోవాలి..
ఇప్పటిదాకా పాత రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు కలిగి ఉన్న వారికి మాత్రమే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. తాజాగా, ఆహారభద్రత కార్డుదారులకు సైతం ఆరోగ్యశ్రీ సేవలను వర్తింపజేయాలని సర్కారు నిర్ణయించడం శుభపరిణామం. మొత్తం 110 రకాల వ్యాధులకు జిల్లా దవాఖానతోపాటు గోదావరిఖని ప్రాంతీయ దవాఖాన, మంథని సామాజిక వైద్య శాల, పెద్దపల్లి జిల్లాలోని 18 పీహెచ్‌సీలతో పాటుగా కరీంనగర్‌లోని ప్రతిమ, చల్మెడ ఆనందరావు దవాఖానలతోపాటు అనేక ప్రైవేటు దవాఖానల్లో ఉచితంగా వైద్యసేవలు పొందవచ్చు. కార్డుదారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
– ప్రమోద్‌కుమార్, డీఎంహెచ్‌వో (పెద్దపల్లి)