తిమ్మాపూర్ రూరల్, ఆగస్టు 25: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు దేశ వ్యాప్తంగా రెండు రోజుల స్మార్ట్ ఇండియా హాకథాన్ ప్రోగ్రాంను ఏర్పాటు చేశారు. విద్యామంత్రిత్వ శాఖ, ఇన్నోవేషన్ సెల్, ఏఐసీటీఈ న్యూడిల్లీ, పర్సిస్టెంట్స్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, షెల్‌తో పాటూ 14 కంపెనీలు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా, దేశంలో 75, తెలంగాణలో 4 నోడల్ సెంటర్లలో విద్యార్థులకు ఇన్నోవేషన్ పోటీ పెట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలకు చోటు లభించగా, గురువారం ఉదయం ఈ సదస్సును ప్రారంభించారు. గుజరాత్, రాజస్థాన్, తమిళనాడుతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి విద్యార్థులు 14 బృందాలుగా వచ్చారు. ఒక్కో బృందంలో ఆరుగురు విద్యార్థుల చొప్పున ఉన్నారు.
ఆరు అంశాలపై కోడింగ్
ఆటోమెటెడ్ నోట్స్ మేకర్ ఫ్రం ఆడియో రికార్డింగ్స్, డిజిటల్ గ్రామర్ టీచర్, కంట్రోలింగ్ స్క్రీన్ టైం ఫర్ చిల్డ్రెన్స్, సైబర్ హైజిన్ ఫర్ స్టూడెంట్స్, ఐడెంటిఫైయింగ్ ద ఏడీహెచ్‌డీ ఇన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రెన్, రికమండేషన్ సిస్టం ఫర్ ఫ్యూచర్ స్కిల్.. ఈ ఆరు అంశాల్లో ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసుకొని కోడింగ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు బృందాల వారీగా ఎంపిక చేసుకొని తమ ప్రాజెక్టులకు సంబంధించి కోడింగ్ చేస్తున్నారు. ప్రతి ఇన్నోవేషన్ ఆవిష్కరణకు లక్ష రూపాయలు బహుమతి అందజేయనున్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రొఫెసర్ బీ విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో 1977లోనే టెక్నాలజీ మొదలైందని, క్రమంగా సైన్స్, టెక్నాలజీ అద్భుత విజయాలు సాధించిందన్నారు. రాబోయే రోజుల్లో సెన్సార్ సాంకేతికతే వ్యవస్థను శాసిస్తుందని, దీనిపై విద్యార్థులు దృష్టి సారిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. అలాగే టీసీఎస్ సీనియర్ మేనేజర్ టీ పూర్ణచందర్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ ఇన్నోవేటివ్ ఆలోచనలను క్షేత్రస్థాయి వినియోగదారుడికి చేరేలా దృష్టి సారించాలన్నారు. ఏఐసీటీఈ నోడల్ సెంటర్ ఇన్చార్జి నీలేశ్ లేలే మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 2 వేల మంది విద్యార్థులు ఇన్నోవేషన్‌లో పాల్గొంటున్నారన్నారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ డాక్టర్ డీ శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపాల్ సీహెచ్ శ్రీనివాస్, డైరెక్టర్లు వినోద్, ప్రకాశ్‌రెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రమౌళి, అధ్యాపకులు పాల్గొన్నారు.
సృజనాత్మకత బయటికి వస్తుంది.
జాతీయ స్థాయి ఇన్నోవేషన్ ప్రోగ్రాం ఉమ్మడి జిల్లా పరిధిలో మా కళాశాలకు దక్కడం ఆనందంగా ఉంది. ఇలాంటి ఇన్నోవేషన్ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లోని సృజనాత్మకత బయటికి వస్తుంది. బృందాల మధ్య పోటీతత్వంతో ఒకరికంటే ఒకరు ఎక్కువగా దృష్టి సారిస్తారు. ప్రతీ విద్యార్థి కొత్త ఆలోచనతో ఇన్నోవేషన్ చేయవచ్చు. పది మందికి ఉపయోగపడే నూతన ఆలోచనలపై విద్యార్థులు దృష్టి సారించాలి. మా వాగేశ్వరి విద్యాసంస్థలో కూడా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేపడతాం.
-డాక్టర్ గండ్ర శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్ (వాగేశ్వరి విద్యాసంస్థలు)