పెద్దపల్లి కమాన్, ఆగస్టు 17: వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫ్రీడం కప్ ఫైనల్ పోటీలను గురువారం నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ తూము రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే పోటీల్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, టగ్ ఆఫ్ వార్, లాంగ్‌జంప్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. పోటీల అనంతరం బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు, జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని పోటీలను విజయవంతం చేయాలని వారు కోరారు.
జూలపల్లిలో మండలస్థాయి..
మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి కలిసి మండలస్థాయి క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్ 100 మీటర్లు, లాంగ్ జంప్, షాట్‌పుట్ విభాగాల్లో పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ తహసీల్దార్ అబుబాకర్, ఎంపీడీవో వేణుగోపాల్‌రావు, ఎంఈవో కవిత, ప్రధానోపాధ్యాయుడు పిట్టల లచ్చయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు అక్కపాక సురేశ్, శ్రీవాణి, కన్న ప్రణయ్, వెంకటేశ్, రాజేందర్, సీఆర్పీలు సతీశ్, తిరుమల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పెద్దాపూర్‌లో..
పెద్దాపూర్‌లోని ‘ఆదర్శ’ పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనంలో పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం నుంచి సరఫరా చేసిన యూనిఫాంలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఇక్కడ ఎస్ఎంసీ చైర్మన్ బాలకృష్ణ, ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
నేడు ఎంపిక..
ఈ నెల 19వ తేదీన పెద్దపల్లిలో నిర్వహించనున్న జిల్లా స్థాయి ఆటల పోటీలకు గురువారం ఎన్టీపీసీ టీటీఎస్‌లోని జిల్లా పరిషత్ క్రీడామైదానంలో రామగుం డం మండల స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఎంఈవో దాసరి లక్ష్మి, పోటీల కన్వీనర్ పీడీ శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, వ్యాయామ ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల నుంచి 6-10వ తరగతికి చెందిన విద్యార్థుల్లో ఒక జట్టును మాత్రమే పోటీలకు పంపించాలని సూచించారు. ఉదయం 9.30 గంటలకు విద్యార్థులు తమ పేర్లను క్రీడా మైదానంలో నమోదు చేసుకోవాలని తెలిపారు. కబడ్డీ, వాలీబాల్, 100 మీటర్ల పరుగుపందెం, లాంగ్‌జంప్, షాట్‌పుట్ క్రీడలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.