Nepal PM : టిబెట్ సరిహద్దు ప్రాంతం (Tibet boarder) లో ఊహించని విధంగా వచ్చిన ఆకస్మిక వరదల (Flash Floods) వల్ల నేపాల్ (Nepal) తీవ్రంగా నష్టపోయింది. భోటేకోశి నది (Bhotekosi River) లో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగి గ్రామాలు, ప్రాజెక్టు సైట్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. వందలాది మంది గల్లంతయ్యారు. ఈ దారుణ విపత్తుపై నేపాల్ ప్రధాని (Nepal PM) బాలేంద్ర బాలేన్ షా (Balen Shah) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
ఇది దేశం ఎన్నడూ చూడని రీతిలో సంభవించిన ఘోర విపత్తు అని నేపాల్ ప్రధాని అభివర్ణించారు. బాధితుల రక్షణ, సహాయక చర్యల కోసం నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీసు బలగాలు, విపత్తు నిర్వహణ బృందాలు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాయని వెల్లడించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా విరామం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
ఇప్పటికే రసువా జిల్లాలోని తిమురే ప్రాంతం నుంచి 21 మంది భారతీయులతో సహా 116 మందిని నేపాల్ ఆర్మీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చిందని తెలిపారు. బాధితులకు ఆహారం, తాత్కాలిక నివాసం, వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వం తన వద్ద ఉన్న పూర్తి యంత్రాంగాన్ని వినియోగిస్తోందని భరోసా ఇచ్చారు. ఈ క్లిష్ట సమయంలో భారత్ సహా అంతర్జాతీయ దేశాలు సహాయం అందించేందుకు ముందుకు వచ్చినట్లు ప్రధాని తెలిపారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు నేరుగా ఫోన్ చేసి పరామర్శించి, 10 టన్నుల అత్యవసర సహాయక సామాగ్రిని పంపించారని నేపాల్ ప్రధాని చెప్పారు. భారత ప్రధానికి నేపాల్ ప్రధాని షా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాధితులెవరూ అధైర్యపడవద్దని, అందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన విజ్ఞప్తి చేశారు.