కరీంనగర్, జూలై 29 (నమస్తే తెలంగాణ ప్రతినిది) : నాడు చిన్న జ్వరానికి కూడా మందు బిల్ల దొరకని సర్కారు దవాఖానలు, నేడు అపర సంజీవనులుగా మారాయి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కాయకల్ప చికిత్స చేయడంతో కార్పొరేట్‌కు దీటుగా సేవలందుతున్నాయి.. హైదరాబాద్ లాంటి నగరాలకే పరిమితమైన కీలక శస్త్రచికిత్సలు రూపాయి ఖర్చు లేకుండా జిల్లాల వైద్యశాలల్లోనూ జరుగుతున్నాయి.. స్థానికంగానే లక్షల విలువైన ఆపరేషన్లు ఉచితంగా చేస్తూ ప్రాణాలు నిలుపుతుండగా, ప్రభుత్వ వైద్యంపై మరింత నమ్మకం పెరుగుతున్నది. పేద, మధ్యతరగతి వర్గాల ఆరోగ్యానికి భరోసా దొరుకగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు వైద్యుల పనితీరుపై అభినందనల వర్షం కురుస్తున్నది.
నాటి ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు దవాఖానల పరిస్థితి అధ్వానంగా ఉండేది. వైద్యులు, సిబ్బంది, మౌలిక వసతులు, మందులు, పరికరాల కొరత కారణంగా ప్రజలు ప్రభుత్వ వైద్యశాల అంటేనే భయపడేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యమే లక్ష్యంగా వైద్య రంగానికి పెద్దపీట వేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో కోట్లాది రూపాయలతో దవాఖానలను ప్రభుత్వం బలోపేతం చేసింది. వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయడంతోపాటు భవనాల నిర్మాణం, ఆధునీకరణ, అవసరమైన మందులు, వైద్య పరికరాలను సమకూర్చింది. జిల్లా దవాఖాన నుంచి మొదలు పీహెచ్‌సీల దాకా ఆధునిక సౌకర్యాలు కల్పించగా, వైద్యులు మెరుగైన సేవలందిస్తున్నారు. హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండా స్థానికంగానే అత్యంత ఖరీదైన వైద్యం అందిస్తున్నారు. హైరిస్క్ కేసులకూ చికిత్స అందిస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో లక్షల రూపాయలు ధారపోస్తే చేసే కీలకమైన ఆపరేషన్లు పూర్తి ఉచితంగా చేస్తున్నారు.
మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్సలు, ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు, కంటి ఆపరేషన్లు రూపాయి ఖర్చు లేకుండా చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో హైరిస్క్ కేసులు టేకప్ చేసి, ప్రాణాలు నిలుపుతున్నారు. నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యమిచ్చి, సర్కారు దవాఖానలపై భరోసా కల్పిస్తున్నారు. 60 వేల నుంచి లక్ష వరకు అయ్యే ల్యాప్రోస్కోపిక్ సర్జరీలను ఇటీవల కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలో పూర్తి ఉచితంగా చేశారు. వేములవాడ ఏరియా దవాఖానలో ఇప్పటి వరకు ఐదుకుపైగా మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్సలను చేశారు. ఇంకా గోదావరిఖని, హుజూరాబాద్ దవాఖానల్లో లక్షలాది రూపాయల విలువైన సర్జీలు చేశారు. సిరిసిల్లలో పక్షవాత బాధితుడికి వైద్యులు సకాలంలో ఖరీదైన చికిత్స అందించి శాశ్వత వైకల్యం, ప్రాణాపాయం నుంచి తప్పించారు. జగిత్యాల ఏరియా దవాఖానలో నవజాత శిశువులకు అరుదైన శస్త్రచికిత్సలు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మెరుగైన సేవలు అందుతుండగా, రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి లక్షలు పోసే బాధ తప్పిందని, ప్రభుత్వ దవాఖానల్లో భరోసా దొరుకుతున్నదని సంతోషంగా చెబుతున్నారు.
ఉచితంగా లక్షల విలువైన ఆపరేషన్లు
తెలంగాణ సాధించుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్ద పీట వేసింది. రోగాల బారిన పడి వైద్యం కోసం ప్రైవేటులో రూ.లక్షలు ఖర్చు చేసే పరిస్థితిలో ప్రభుత్వ దవాఖానలను అరుదైన శస్త్ర చికిత్సలకు నిలయాలుగా మార్చింది. ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహిస్తూ ఎందరో ప్రాణాలను రక్షించింది. ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యవేక్షణ చేస్తున్నది. దీంతో ప్రతి ప్రభుత్వ దవాఖానలో శస్త్ర చికిత్సలు పెరిగాయి. అంతే కాకుండా తుంటి, మోకాలు మార్పిడి వంటి అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తూ సర్కారు దవాఖానలు పేదలకు సంజీవనిలా నిలుస్తున్నాయి.
గోదావరిఖనిలో పెద్ద పేగుకు శస్త్రచికిత్స
ఇటీవల ప్రాణాపాయ స్థితికి చేరిన వ్యక్తికి గోదావరిఖని ఏరియా దవాఖాన వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి పునర్జన్మనిచ్చారు. గోదావరిఖనికి చెందిన గోవింద్ నవీన్ కొంతకాలంగా తీవ్రమైన కడుపువొప్పితో బాధపడుతూ ఈ నెల 13న ఖని ఏరియా దవాఖానకు వచ్చాడు. డాక్టర్ కళావతి పరీక్షలు చేసి, ఇంటరెయిన్ పర్పోరేషన్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. తీసుకున్న ఆహారం జీర్ణం కాక పసరు రూపంలో జారి కడుపు ఉబ్బుతుందని గుర్తించారు. ప్రాణాలకు ప్రమాదం ఉండడంతో డాక్టర్లు ఉదయ్‌కుమార్, ప్రకాశ్, ఎనిస్తీషియన్లు భానులక్ష్మి, అజహర్, రాజేశ్వరి, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది మానస, పుష్ప, రవి బృందం నవీన్‌కు ఆపరేషన్ చేశారు. అతడి శరీరంలోని ఒమెంటన్ ఆనే పొరను రంధ్రం పడిన పేగు వద్ద అంటించి మూసివేశారు. 18 సెం.మీ కోసి 12 కుట్లు వేశారు. పూర్తిగా కోలుకున్నాక ఈ నెల 22న డిశ్చార్జ్ చేశారు. ప్రైవేట్ దవాఖానలో ఈ శస్త్రచికిత్సకు 2 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు.
రమేశ్‌కు తప్పిన ప్రాణగండం
హుజూరాబాద్, జూలై 29 :హనుమకొండ జిల్లా ఉప్పల్ చెందిన మాడిశెట్టి రమేశ్ టేలరింగ్ చేసేవాడు. నెల క్రితం కడుపు నొప్పి రాగా హన్మకొండకు ఓ ప్రవేట్ దవాఖానకు వెళ్లాడు. అక్కడ వైద్యులు కడుపులో కుడి కిడ్నీ పక్కన కంతి(రెట్రో పెరిటోనియల్ మాస్)ఉందని నిర్ధారించారు. ఆపరేషన్‌కు రూ.లక్షన్నర అవుతుందని, త్వరగా చేయకపోతే ప్రాణానికి ప్రమాదమని చెప్పారు. అప్పటికే రక్త, మూత్ర, స్కానింగ్ తదితర పరీక్షలకు రూ.5 వేలకు పైగానే ఖర్చయ్యాయి. చేతిలో చిల్లి గవ్వ లేకపోవడం, రోజురోజుకూ కడుపపులో నొప్పి ఎక్కువ అవుతున్న తరుణంలో రమేశ్ నాలుగు రోజుల క్రితం హుజూరాబాద్ సర్కార్ దవాఖానకు వచ్చాడు. పరీక్షించిన వైద్యులు శ్రీకాంత్ రెడ్డి, రమేశ్ తక్షణమే ఆపరేషన్ చేసి 4 కిలోల కంతి తొలగించారు. ప్రస్తుతం రమేశ్ కోలుకుని సంతోషంగా ఉన్నాడు. సర్కార్ దవాఖాన ఉండబట్టే చావు నుంచి బయటపడ్డానని రమేశ్ ప్రభుత్వానికి, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపాడు.
బాధ్యత మరింత పెరిగింది
గతేడాది మే 28వ తేదీన వేములవాడ ఏరియా దవాఖాన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో వచ్చింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అత్యవసర సేవలతో ఈ వైద్యశాల ప్రారంభమైంది. అప్పటి నుంచి మెరుగైన వైద్యసేలందిస్తున్నాం. ఇప్పటి వరకు ఈ దవాఖానలో 556 ఆపరేషన్లు చేశాం. నెల రోజుల నుంచి కంటి ఆపరేషన్లు కూడా చేస్తున్నాం. ఇప్పటి దాకా ఏడుగురికి ఆపరేషన్లు చేశాం. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఇక్కడ కీలుమార్పిడి శస్త్రచికిత్సను చేశాం. చేస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు ఐదుగురికి కీలు మార్పిడి ఆపరేషన్లు చేశాం. ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సలను చేయడం ఆనందంగా ఉన్నది. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు సహకారంతో ముందుకెళ్తున్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా అనేక శస్త్రచికిత్స సేవలను పూర్తి ఉచితంగా చేస్తున్నాం. ఈ నెల 24న ఆరోగ్యశ్రీ ద్వారా ఇద్దరికి మోకాలు కీలుమార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతం చేశాం. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు వేర్వేరుగా ట్విట్టర్ వేదికగా అభినందించడం ఆనందంగా ఉన్నది. ఇది మాపై బాధ్యతను మరింత పెంచింది.
-రేగులపాటి మహేశ్‌రావు, వేములవాడ దవాఖాన సూపరింటెండెంట్
ప్రైవేట్ల రెండు లక్షలు అయినయ్..ఇక్కడ ఒక్క రూపాయీ కాలె..
నాది వట్టిమల్ల. నాకు 64 ఏండ్లుంటయి. ఎవుసం జేస్కొని బతుకుతం. పదేండ్ల సంది మోకాలు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న. మస్తు దవాఖాన్లు తిరిగిన. లక్షలు ఖర్చు చేసినా నయం కాలె. ఏడాది కింద నొప్పి ఎక్కువైంది. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు పోతే ఆపరేషన్ చేయాలన్నరు. నాలుగు లక్షలు అయితయ్ అన్నరు. అప్పుడు రెండు లక్షలతో ఎడమ కాలు మోకీలు మార్పిడి చేయించుకున్న. కొద్ది రోజల సంది కుడికాలు మోకాలు నొప్పి ఎక్కువైంది. నా వశంగాలె. అప్పుడే ఎములవాడ సర్కారు దవాఖాన్ల ఆపరేషన్ చేత్తరని తెలిసి, పది రోజుల కింద వచ్చిన. 24వ తేదీన ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసిన్రు. నిన్న (శుక్రవారం) ఇంటికి పంపించిన్రు.సీఎం కేసీఆర్ పుణ్యమాని రూపాయి ఖర్చు లేకుండ మంచిగైన. ఆ సారుకు, డాక్టర్లకు రుణపడి ఉంట.
–భూక్య శీల, వట్టిమల్ల (కోనరావుపేట మండలం)
పైసా ఖర్చు లేకుండా టోటల్ హిప్స్ రీప్లేస్మెంట్
కరీంనగర్‌లోని టవర్‌సర్కిల్ ప్రాంతానికి కామారపు శివకుమార్ ఓ కంపెనీలో సేల్స్‌మన్‌గా పనిచేసేవాడు. ఒక రోజు కింద పడడంతో కాలు తుంటికి దెబ్బ తగిలింది. అప్పుడు ఏర్పడలేదు. కొద్ది రోజుల తర్వాత నొప్పి మొదలై క్రమంగా తీవ్రం కావడంతో కుంటుతూ నడవాల్సి వచ్చింది. నాలుగు నెలల తర్వాత కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు వెళ్లాడు. రెండు కాళ్ల తుంటిలకు రక్తం సరఫరా ఆగిపోయి బాల్స్ క్రమంగా ఎండిపోతున్నాయని, రెండు కాళ్లకు ఉన్న టోటల్ హిప్స్ రీప్లేస్మెంట్ (టీహెచ్ఆర్) ఆపరేషన్ చేయాలని, ఇందుకు 15 లక్షల వరకు ఖర్చవుతుందని సదరు వైద్యులు చెప్పారు. దాంతో శివకుమార్ ఆందోళన చెందాడు.
ఇంత మొత్తం వెచ్చించే పరిస్థితి లేకపోవడంతో మరో 3 నెలలు ఇంటి వద్దనే ఉండిపోయాడు. చివరికి కరీంనగర్ ప్రధాన దవాఖానకు రావడంతో ఆర్థోపెడిక్ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ నారగోని కుమార్‌గౌడ్ అన్ని రకాల పరీక్షలు చేశారు. టీహెచ్ఆర్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని గుర్తించారు. శివకుమార్‌కు ఆరోగ్య శ్రీ కార్డు లేక పోవడంతో దరఖాస్తు చేయించి, కొత్త కార్డు వచ్చేలా చొరవ చూపారు. నాలుగు రోజుల క్రితం ఒక కాలుకు టీహెచ్ఆర్ ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం శివకుమార్ ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఒక కాలు బాగు కాగానే మరో కాలుకు కూడా ఇదే తరహాలో శస్త్ర చికిత్స చేయనున్నారు. ఈ అరుదైన ఆపరేషన్ కోసం వైద్యుడు కుమార్గౌడ్తోపాటు వైద్యుల బృందం రవీందర్, ధన్‌రాజ్, చంద్రశేఖర్, టెక్నీషియన్ లక్ష్మణ్, ఓటీ ఇన్చార్జి పుష్పలత శ్రమించారు.
చేస్తున్న శస్త్రచికిత్సలివే..
మోకాలు కీలు మార్పిడి, టోటల్ హిప్స్ రీప్లేస్మెంట్ (టీహెచ్ఆర్), పక్షవాత బాధితులకు టిష్యూ ప్లాస్మినోజెనిక్ యాక్టివేటర్ ఇంజక్షన్, ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు, పెద్ద పేగు ఆపరేషన్, అపెండిసైటిస్, హైడ్రోసిల్, హెర్నియా, అబ్డామిన్ సంబంధిత శస్త్రచికిత్సలు, కాటరాక్ట్, మోతె బిందు ఆపరేషన్లు, శిశువులకు ఆనల్ రెక్టల్ ఫార్మేషన్, డికార్ట్టేషన్, ఐపాస్ పీడియాస్.. ఇలా ఎన్నో