కరీంనగర్, జూలై 16 (నమస్తే తెలంగాణ): వారం రోజులపాటు ఏకధాటిగా వర్షాలు కురిసినా.. భారీగా వరదలు వచ్చినా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకటి రెండు చోట్ల తప్పితే ఎక్కడా ప్రయాణాలకు ఆటంకం కలుగలేదు. గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోలేదు. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్లతో నిర్మించిన రోడ్లు, వంతెనలు. చిన్నచిన్న గ్రామాలకు సైతం తారు రోడ్లు వేయడంతో పాటు ఒర్రెలపై వంతెనలు నిర్మించి ప్రయాణాలను సులభతరం చేసింది. భారీ వరదలు వచ్చినా గ్రామాలకు సంబంధాలు తెగకుండా చేసింది. అందుకు ఉదాహరణగా కొన్ని చూద్దాం..
రామడుగు మండలం సుద్దాలపల్లి- వన్నారం మధ్య మోతె వాగుపై వంతెన నిర్మించక ముందు ఈ గ్రామాల ప్రజలకు కొత్తపల్లి (హ) మీదుగా ప్రధాన రహదారికి చేరుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. కొత్తపల్లి పట్టణంలోని పాఠశాలలకు వెళ్లి చదువుకునే విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉండేది. వాగు తగ్గితేగానీ తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపేవారు కాదు. వాగు వచ్చినపుడు అనేక సార్లు విద్యార్థులు పరీక్షలు రాయని సందర్భాలు సైతం ఉన్నాయి. తమ అవసరాలకు కరీంనగర్ వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది.
జమ్మికుంట మండలం శంభునిపల్లి, తనుగుల మధ్య నిర్మించిన వంతెన కరీంనగర్- పెద్దపల్లి జిల్లాలను కలుపుతోంది. మానేరుపై కిలో మీటరుకుపైగా పొడవుతో నిర్మించిన ఈ వంతెన ఈ ప్రాంత వాసులకు ఎంతో మేలు చేసింది. ఇది నిర్మించకముందు జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాలకు చెందిన ప్రజలకు పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల, తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే హుజూరాబాద్, కరీంనగర్, సుల్తానాబాద్ మీదుగా ప్రయాణించాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వంతెనను నిర్మించడంతో ఇపుడు సులువుగా పెద్దపల్లి జిల్లాకు చేరుకుంటున్నారు. మానేరు అవతల గుంపుల వద్ద పెద్దపల్లి జిల్లాతో ఈ వంతెన కరీంనగర్ జిల్లాను అనుసంధానం చేసింది.
ఈ వంతెనలు మచ్చుకు మాత్రమే. ఉమ్మడి జిల్లాలో ఇంకా అనేక వంతెనలు నిర్మించారు. శంకరపట్నం మండలం ఆముదాలపల్లి వద్ద నిర్మించిన వంతెనతో వీణవంక, శంకరపట్నం మండలాలకు రాకపోకలు సునాయసంగా సాగుతున్నాయి. హుజూరాబాద్ మండలం ఇప్పలనర్సింగాపూర్ గ్రామం ప్రతి వానకాలంలో జలదిగ్బంధంలో చిక్కుకునేది. ఎటు నుంచీ బయటికి వచ్చే పరిస్థితి ఉండకపోయేది. హుజూరాబాద్, ఇప్పల నర్సింగాపూర్ గ్రామాల మధ్య వంతెన నిర్మాణంతో హుజూరాబాద్ నుంచి భీమదేవరపల్లి వరకు రాకపోకలు సులువుగా సాగుతున్నాయి. వీణవంక మండలం బామండ్లపల్లి- వీణవంక మధ్య ఉన్న రెడ్డిపల్లి చెరువు మత్తడి పడుతున్న కారణంగా ఈ గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచి పోయేవి. ఇప్పుడు ఇక్కడ వంతెన నిర్మాణం చేపట్టడంతో సులువుగా ప్రయాణాలు సాగిస్తున్నారు.
చెక్‌డ్యాంతో దూరానికి చెక్
కరీంనగర్‌రూరల్ మండలంలోని మరో వాగుపై మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక శ్రద్ధతో చెక్‌డ్యాంను నిర్మించారు. దీంతో నగునూర్ ప్రజలకు 6 కిలోమీటర్ల దూర భారం తగ్గింది. నగునూర్ గ్రామస్తులు కరీంనగర్‌కు రావాలంటే నగునూర్ స్టేజీ నుంచి ఎలబోతారం, వల్లంపహాడ్, తీగలగుట్టపల్లి మీదుగా ప్రయాణించాల్సి వచ్చేది. ఇది ప్రధాన రహదారి కావడం, నిత్యం రద్దీగా ఉండడంతో ప్రమాదాలు ఎక్కువగా జరిగేవి. దీంతో వాగుపై చెక్‌డ్యాం కం బ్రిడ్డి నిర్మించారు. తీగలగుట్టపల్లి నుంచి నగునూర్ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీంతో నగునూర్ వాసులు తీగలగుట్టపల్లి మీదుగా కేవలం 4 కిలో మీటర్లు ప్రయాణించి కరీంనగర్‌కు చేరుకుంటున్నారు. అంతే కాకుండా చెక్ డ్యాంతో భూగర్భ జలాలు పెరిగి ఈ ప్రాంతం వ్యవసాయానికి అనువుగా మారింది..
కష్టాలు తీరినయ్..
కరీంనగర్ రూరల్ మండలంలోని తాహెర్‌కొండాపూర్ కష్టాలను తీర్చింది ఈ వంతెన. ఒకప్పుడు చెర్లభూత్కూర్ శివారు గ్రామంగా ఉన్న ఈ గ్రామం ఇప్పుడు ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. ఈ రెండు గ్రామాల మధ్య ఒక ఒర్రె ఉంది. ప్రతి వానాకాలం ఒర్రె పారితే చెర్లభూత్కూర్తో కొండాపూర్‌కు సంబంధాలు తెగిపోయేవి. రాకపోకలు నిలిచిపోయేవి. దీంతో కొండాపూర్ వాసులు గుజ్జులపల్లి మీదుగానైనా బహద్దూర్‌ఖాన్‌పేట మీదుగానైనా ఎటు వెళ్లినా 14 కిలో మీటర్లు తిరిగి చెర్లభూత్కూర్‌కు చేరుకోవాల్సి వచ్చేది. కరీంనగర్ వెళ్లాలంటే దుబ్బపల్లి మీదుగా వెళ్లాల్సి వచ్చేది. మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చొరవతో 2016లో ఈ ఒర్రెపై వంతెన నిర్మించారు. అంతే కాకుండా చెర్లభూత్కూర్ నుంచి కొండాపూర్ వరకు బీటీ రోడ్డు వేశారు. దీంతో ఈ గ్రామాల మధ్య ప్రయాణం సులభతరమైంది. ఎంత వర్షం వచ్చినా, ఒర్రెలో ఎంత భారీ వరద ఉన్నా ఇప్పుడు వంతెన మీదుగా సులువుగా రాకపోకలు సాగిస్తున్నారు.
ప్రతి మండలంలోనూ వంతెనలు
తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల నేతృత్వంలో జిల్లాలోని పలు మండలాల్లో పెద్ద సంఖ్యలో వంతెనలు నిర్మించారు. సారంగాపూర్ మండలంలో పెంబట్ల, రంగపేట, గ్రామాల్లో సదాజల వాగుపై వంతెన నిర్మాణం పూర్తయింది. బీర్పూర్ మండలంలోని కొల్వాయి, తాళ్లధర్మారం గ్రామాల్లోనూ వంతెనలు నిర్మించారు. సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో నాలుగు వంతెనల నిర్మాణానికి రూ.6.50 కోట్లు వ్యయం చేశారు. పెగడపల్లి మండలంలో రూ.14.50 కోట్ల వ్యయంతో దేవికొండ, ల్యాగలమర్రి, పెగడపల్లి, మ్యాకవెంకయ్యపల్లి, నందగిరి, ఐతుపల్లి గ్రామాల్లో వాగులపై వంతెనలు నిర్మించారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో ఎస్సారెస్పీ కెనాల్‌పై రూ.1.10 కోట్లతో వంతెన నిర్మించారు. మెట్పల్లి వట్టివాగుపై రూ.5.83 కోట్లతో వంతెన పూర్తి చేశారు.
మల్లాపూర్-గొర్రెపెల్లి మధ్య రూ.2.15 కోట్లతో వంతెన ఏర్పాటు చేశారు. వెల్గటూర్ మండలంలో కోటిలింగాల, పాతగూడూరు-సూరారం, కొండాపూర్-శాఖాపూర్, జగదేవ్‌పేట-వెల్గటూర్ గ్రామాల మధ్య రూ. 8.17 కోట్లతో వంతెనలు నిర్మించారు. ధర్మపురి- ధమ్మన్నపేట, ధర్మపురి-నక్కలపేట మధ్య వంతెనలను రూ. 4.70 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. మెట్పల్లి జగ్గసాగర్, వెల్లుల-మెట్పల్లి, మెట్పల్లి శివారులో మూడు వంతెనలు రూ.7.70 కోట్లతో నిర్మించారు. ఇబ్రహీంపట్నం మండలంలో ఇబ్రహీంపట్నం-గోదూరు, గోదూరు-తిమ్మాపూర్, యామాపూర్-వేములకుర్తి, ఎర్దండి- కొండాపూర్, ఇబ్రహీంపట్నం- కేశాపూర్, అమ్మక్కపేట-ఇబ్రహీంపట్నం గ్రామాల మధ్య రూ.16 కోట్లతో ఆరు వంతెనలు నిర్మించారు. కొడిమ్యాల మండలంలో కొడిమ్యాల సూరంపేట మధ్య, పోతారం పీడబ్ల్యూ రోడ్డు నుంచి పోతారం వరకు రెండు వంతెనలను రూ.3.80 కోట్లతో నిర్మించారు. మల్యాల మండలంలోని మ్యాడంపెల్లిలో రూ.2.30 కోట్ల వ్యయంతో వంతెన నిర్మించారు. జిల్లాలో మొత్తం 32 వంతెనలు నిర్మించారు.
ఇక్కట్లు తీర్చిన వీణవంక వంతెన
భారీ వర్షాలు వచ్చినప్పుడు వీణవంక మండల కేంద్రం నుంచి పారుతున్న వాగు (వీణవంక వాగు)లో ప్రవాహం విపరీతంగా ఉండేది. దీంతో వాగు అవతల ఉన్న రామకృష్ణాపూర్ గ్రామస్తులకు వీణవంకతో సంబంధాలు తెగిపోయేవి. వరద తగ్గితేగానీ ఈ వాగు నుంచి వీణవంక చేరుకునే పరిస్థితి ఉండకపోయేది. ఒక్కోసారి వారం పది రోజుల వరకు దాటనిచ్చేది కాదు. రామకృష్ణాపూర్ శివారులో వ్యవసాయ భూములు ఉన్న వీణవంక రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉండేవి. వాగు పారినన్ని రోజులు రెడ్డిపల్లి మీదుగా 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రామకృష్ణాపూర్ చేరుకునేవాళ్లు. రామకృష్ణాపూర్ గ్రామస్తులైతే ప్రతి అవసరానికి వీణవంకకే వస్తుంటారు. వారి బాధలు కూడా వర్ణనాతీతంగా ఉండేవి. అనేకసార్లు ఎడ్లు సహా బండ్లు కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ వాగుపై భారీ వంతెన నిర్మించారు. దీంతో కేవలం 2 కిలో మీటర్లు ప్రయాణించి రామకృష్ణాపూర్ ప్రజలు వీణవంక చేరుకుంటున్నారు. వీణవంక రైతులు సులువుగా తమ వ్యవసాయ భూములకు వెళ్లి పనులు చేసుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో భారీ వరద వచ్చినా వంతెన మీదుగా యధావిధిగా ప్రయాణించి తమ పనులు చేసుకున్నారు.
మకుటాయమానంగా బోర్నపెల్లి వంతెన
గోదావరినదికి ఉత్తరంగా ఉమ్మడి ఆదిలాబాద్, దక్షిణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు విస్తరించి ఉండగా, పరీవాహక ప్రాంతం ఒడ్డున రెండు జిల్లాల్లోనూ గ్రామాలు ఏర్పడ్డాయి. ఇటు రాయికల్ మండలం బోర్నపెల్లి గ్రామం ఉండగా, ఆవలి ఒడ్డున నిర్మల్ జిల్లా కడెం మండలం చిన్నబెల్లాల ఉన్నది. అతి సమీపంలో ఈ గ్రామాలు ఉండటంతో నది పరీవాహక గ్రామాల మధ్య వైవాహిక సంబంధాలు ఏర్పడ్డాయి. అలాగే స్నేహ సంబంధాలు ఉన్నాయి. నది ప్రవాహ సమయంలో బోట్ల ద్వారా, ప్రవాహం లేని సమయంలో కాలినడకన ప్రజలు అటూ, ఇటూ ప్రయాణం సాగిస్తున్నారు. అయితే, కిలోమీటర్ మేర వ్యాపించిన గోదావరినదిని దాటే ప్రయత్నంలో పలు దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో అటు వైపు ప్రజలు నిర్మల్ మీదుగా, రాయికల్ మండలానికి చేరుకుని 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్నపల్లికి వెళ్లే వారు. కిలోమీటర్ దూరంలో ఉన్న గ్రామానికి చేరుకునేందుకు 80 నుంచి 90 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఇటీవలి కాలంలో కమ్మునూర్-కలమడుగు వంతెన నిర్మాణంతో దూరభారం కొంత తగ్గినప్పటికీ 60 కిలోమీటర్లు చుట్టుకొని రావాల్సిందే.
ఈ అవస్థలు తీరాలంటే బోర్నపెల్లి-చిన్నబెల్లాల మధ్య వంతెన నిర్మించడం ఒక్కటే మార్గమని రెండు జిల్లాల్లోని పరివాహక గ్రామాల ప్రజలు గుర్తించి దశాబ్దాలుగా ప్రజాప్రతినిధులను వేడుకుంటూ వచ్చారు. అయినా ప్రయోజనం కలుగలేదు. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన కల్వకుంట్ల కవిత వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆమె కృషితో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి బోర్నపెల్లి-చిన్నబెల్లాల మధ్య కిలోమీటర్ పొడవున వంతెన నిర్మాణానికి రూ.70 కోట్లు మంజూరు చేశారు. 2016 ఏప్రిల్ 6న అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. 29 పిల్లర్లతో విశాలమైన విస్తీర్ణంతో నాణ్యమైన వంతెన పూర్తయింది. దీంతో నదిపరీవాహక గ్రామాల ప్రజల ఇబ్బందులు తొలగిపోయి ఇరు ప్రాంతాల సంబంధాలు పెరిగిపోయాయి.