పాలకుర్తి, జూలై 17: వర్షాల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకుంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రకటించారు. ఇండ్లు, పంటలు దెబ్బతిన్న బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. శనివారం ఆయన పాలకుర్తి మండలంలోని కొత్తపల్లి, రామారావుపల్లి, పుట్నూర్, కుక్కలగూడూర్, గుడిపల్లి, జయ్యారం, ఈసాలతక్కళ్లపల్లి, పాలకుర్తిలో పర్యటించారు. వరదలవల్ల తెగిన కుంటలు, దెబ్బతిన్న వరి, పత్తి చేన్లను పరిశీలించారు. ఇండ్లు పూర్తిగా ధ్వంసమైన వారికి భవిష్యత్‌లో డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేసేందుకు యత్నిస్తామన్నారు.
కొత్తపల్లిలో తెగిపోయిన బ్రాహ్మణకుంటను పరిశీలించిన ఆయన, కుంట కింద పొలాల్లో పేరుకుపోయిన ఇసుకమేటలను తొలగించాలని అధికారులను అదేశించారు. గ్రామాల్లో చెరువుల కింద, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చెందిన కాల్వలను కొందరు ఆక్రమించుకొని పూడ్చివేయడంతోనే కట్టలు తెగుతున్నాయని కొత్తపల్లి సర్పంచ్ మల్లేత్తుల శ్రీనివాస్ ఎమ్మెల్యేకు తెలిపారు. కుక్కలగూడూర్‌లో కూలిన ఎల్లమ్మగుడిని సందర్శించి పునర్నిర్మాణానికి సాయం చేస్తామని చెప్పారు.
మహిళా కూలీలతో మమేకమై..
ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో కొత్తపల్లి శివారులోని పొలాల్లో నాట్లేస్తున్న మహిళలను చూసి ఆగారు. కారు దిగి పొలంలోకి వెళ్లి వారితో కలిసి నాట్లేశారు. ఈ సందర్భంగా వారితో కలిసి జై తెలంగాణ..జై కేసీఆర్ నినాదాలు చేశారు. వారి పాడిన జానపదాలకు పదం కలిపారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ వ్యాళ్ల అనసూర్యరాంరెడ్డి, వైస్‌ఎంపీపీ ఎర్రంస్వామి, సర్పంచ్‌లు మల్లేత్తుల శ్రీనివాస్, షేర్ల లక్ష్మీపతి, పున్నం శారదసాగర్, గొండ్ర చందర్, కోల లత, మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం రాజయ్య, రైతు బంధు సమితి కన్వీనర్ మదన్మోహన్రావు, ముల్కల కొమురయ్య, నెరువట్ల తిరుపతి పాల్గొన్నారు.