మొగులుకు చిల్లు పడిందా.. అన్నట్లు కుండపోత పోసిన వాన, ఆ వానతో పాటే ముంచెత్తిన వరద.. కానీ, ఎక్కడా పెనుముప్పు వాటిల్లలేదు. దానికి కారణం ప్రభుత్వ ముందు చూపు, యంత్రాంగం అప్రమత్తతే.. భారీ వర్షాలు పడుతున్నాయని అధికారులు కార్యాలయాలకు పరిమితం కాలేదు. కలెక్టర్ సహా అన్ని స్థాయిల సిబ్బంది ప్రజల మధ్యనే ఉండి సహాయక చర్యలు చేపట్టారు. ప్రజాప్రతినిధులు కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించారు. సచ్ఛంద సంస్థల ప్రతినిధులు సహకారం అందించారు. ఎక్కడ ఆపదొస్తే అక్కడికి వెళ్లి అక్కున చేర్చుకున్నారు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి భోజన, వసతి కల్పించి ఆదుకున్నారు. గతంలో ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ప్రాణనష్టం ఉండేది. వరదల్లో చిక్కుకున్నా పట్టించుకునే దిక్కుండేది కాదు. కానీ, ఈ సారి ఇంతటి విపత్కర పరిస్థితి ఎదురైనా.. ఎలాంటి దుర్ఘటనలు లేకుండా బయట పడగలిగామంటే దానంతటికీ కారణం నాయకగణం, యంత్రాంగం కృషేనని స్పష్టమవుతున్నది.
మూడు రోజులు సర్కారు బడిలనే ఉన్నం
మూడు రోజుల కిందట గోదావరిల నీళ్లు శానా వచ్చినయ్.. ఖాళీ చేయాలని సార్లు చెప్పంగనే చేతికి అందిన సామన్లు తీసుకొని సార్లు చూపించిన సర్కారు బడికి చేరుకున్నం. మూడు రోజులు అక్కన్నే ఉన్నం. అన్ని సౌలతులు కల్పించిన్రు.. నీళ్లు తగ్గినంక ఇంటికచ్చి చూస్తే బియ్యం, పప్పులు, తొక్కుడబ్బలు, కారంపొడి అన్నింట్లోకి నీళ్లు చేరి ఖరాబైనయ్. అవి వండుకోడానికి పనికిరావు. ఈ విషయం తహసీల్దార్ సార్‌కు, మిగిలిన సార్లకు చెప్పిన.. రూ.5 వేల సాయం చేసిన్రు.. సాయం అందించినందుకు ధన్యవాదాలు..
అనిర్వచనీయంగా అగ్ని మాపక సేవలు
వరదల్లో చిక్కుకున్న వారిని ఆదుకునేందుకు జిల్లా అగ్నిమాపక శాఖ సేవలు అనిర్వచనీయంగా లభించాయి. కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూర్ వాగులో చిక్కుకున్న 9 మంది ఇటుక బట్టీల కార్మికుల ప్రాణాలను అగ్ని మాపక అధికారులు ప్రాణాలకు తెగించి రక్షించారు. మంత్రి గంగుల కమలాకర్ పర్యవేక్షణలో జిల్లా అగ్నిమాపక అధికారి టీ వెంకన్న సారథ్యంలోని బృందం ఈ సాహసం చేసింది. అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చేసిన సమయంలో నగునూర్ వాగులో విపరీతమైన వరద పోటెత్తుతోంది. ఈ సమయంలో ప్రభుత్వం అందించిన ఇన్ప్లెటెబుల్ బోట్ వరదలో చిక్కుకున్న ఒడిశా కార్మికుల ప్రాణాలు కాపాడింది. వ్యవసాయ బావులు, విద్యుత్తు స్తంభాలు, గుంతలు గుర్తిస్తూ రెస్క్యూ చేసిన అగ్నిమాపక సిబ్బంది వరదకు ఎదురీదుతూ వెళ్లాల్సి వచ్చింది. రెస్క్యూ టీంకు గైడ్ చేసిన అగ్నిమాపక అధికారి వెంకన్న పరిస్థితిని ముందుగానే అంచనా వేసి అక్కడికి ఎలా వెళ్లాలో తమ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. సహాయ అగ్ని మాపక అధికారి డీ ప్రభాకర్, డ్రైవర్ రాము, కరీంనగర్ అగ్నిమాపక కేంద్ర అధికారి టీ పరమేశ్వర్ మరో ఇద్దరు టూరిజం సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి 9 మంది ఒడిశా కార్మికులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ చేయడం తమ బృందానికి గర్వకారణమని అగ్నిమాపక అధికారి టీ వెంకన్న తెలిపారు.
బాధితులను అక్కున చేర్చుకుని
కరీంనగర్‌లోని హౌసింగ్‌బోర్డుకాలనీలో వరదల కారణంగా సమ్మక్క గద్దెల వద్ద చెత్త ఏరుకుని విక్రయించి జీవించే 13 కుటుంబాలకు చెందిన గుడిసెలు పూర్తిగా మునిగిపోగా, 40 మంది నిరాశ్రయులయ్యారు. వీళ్ల పరిస్థితిని గుర్తించిన వీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధుల ఆశ్రమ నిర్వాహకులైన సీపెల్లి వీర మాధవ్ వృద్ధాశ్రమం కోసం కొత్తగా నిర్మిస్తున్న భవనంలో ఆశ్రయం కల్పించారు. నిత్యావసరాలు సరఫరా చేసి, భోజనాలు పెట్టించారు. ఈ విషయాన్ని ఆయన జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి శ్రీధర్ స్పందించి వారికి భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ ట్యాంకర్‌ను సమకూర్చారు. అక్కడే వైద్య సిబ్బందితో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. మందులు అందించారు. జిల్లా మార్కెటింగ్ డీడీ పద్మావతి, మెప్మా పీడీ రవీందర్, అగ్నిమాపక అధికారి టీ వెంకన్న, సీపీవో కొమురయ్య, ఐఅండ్‌పీఆర్ డీఈ కొండయ్య దగ్గరుండి ఈ నిరాశ్రయులకు సహాయం అందించారు.
పునరావాస కేంద్రమైన ప్రైవేట్ పాఠశాల
వరద తాకిడిని తట్టుకోలేని పరిస్థితికి చేరిన గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ కట్టకు అధికారులు గండి కొట్టించి గ్రామాన్ని సురక్షితంగా ఉంచారు. వరద ప్రభావానికి గురైన వారికి గంగాధరలోని వివేకానంద ప్రైవేట్ పాఠశాలలో ఆశ్రయం కల్పించారు. నారాయణపూర్ ఎస్సీకాలనీ, ఈ గ్రామ శివారులోని ఇస్తారిపల్లికి చెందిన సుమారు 300 మందికి రెండు రోజులపాటు పాఠశాలలోని 40 గదులను కేటాయించారు కరస్పాండెంట్ పర్రెం లక్ష్మారెడ్డి. వీరిని ఇక్కడికి తరలించడంలో స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో భాస్కర్ రావు, ఎస్ఐ రాజు, నారాయణపూర్ సర్పంచ్ నజీర్, గంగాధర సర్పంచ్ గంగాధర్ చురుకైన పాత్ర పోషించారు. కాగా, వీరికి ఎస్ఐ రాజు ఒక రోజు భోజనం ఏర్పాటు చేయగా గంగాధర సర్పంచ్ బియ్యం అందించారు. మిగతా నిత్యావసరాలు సమకూర్చుకుని ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ ఉదయం టీ, టిఫిన్లు, రెండు పూటల భోజనం సమకూర్చారు. ఈ పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ ఆర్వీ కర్ణన్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సందర్శించి లక్ష్మారెడ్డితోపాటు అధికారులు, సర్పంచులను అభినందించారు.
శిథిల ఇండ్ల నుంచి సురక్షిత ప్రాంతానికి..
తిమ్మాపూర్ మండలం నేదునూర్లోని గోసంగికాలనీ వాస్తవానికి ఎల్ఎండీ రిజర్వాయర్‌లో ముంపునకు గురైంది. పూర్తి స్థాయి నష్ట పరిహారం రావాలని ఇక్కడి 20 కుటుంబాలకు చెందిన 50 మందికి పైగా శిథిలమైన ఇండ్లలోనే ఉంటూ కాలం గడుపుతున్నారు. వీరి విషయాన్ని సర్పంచ్ వడ్లూరి శంకర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించి కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌కు సమాచారం అందించారు. అం తే కాకుండా కలెక్టర్‌తో కలిసి కాలనీని సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా చూపించారు. పడిపోయే ప్రమాదంలో ఉన్న ఇండ్ల నుంచి స్థానిక పాఠశాలకు తరలించాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలతో అధికారులు వారిని ఇక్కడి ప్రభుత్వ పాఠశాలకు తరలించి వసతి ఏర్పాట్లు చేశారు. తహసీల్దార్ శ్రీవాణి, ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, ఆర్ఐ అనీల, సర్పంచ్ శంకర్ చొరవతో ఇక్కడి వారిని పునరావాస కేంద్రానికి తరలించారు. రెండు రోజులుగా భోజనాలు, సౌకర్యాలు కల్పిస్తుస్తున్నారు.