బోయినపల్లి, జూలై 15: వర్ష బాధితులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసానిచ్చారు. భారీ వర్షాలతో ఇండ్లు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతినగా, ప్రభుత్వం మంజూరు చేసిన సాయాన్ని బాధితులకు శుక్రవారం సాయంత్రం రామన్నపేటలో ఇద్దరికి, తడగొండలో ఒకరికి ఎమ్మెల్యే రవిశంకర్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాటి ప్రభుత్వాలు ఇండ్లు కూలిపోయిన బాధితులకు ఎన్నడూ సాయం అందించలేదని, ఒక వేళ మంజూరు చేసినా ఏండ్లు పట్టేదని గుర్తు చేశారు. కానీ, నేడు తెలంగాణ ప్రభుత్వం మాత్రం పాక్షికంగా అందించే సాయం పెంచిందని, అలాగే పూర్తిగా ఇండ్లు కూలి పోయిన వారికి 90 వేల సాయంతోపాటు పునరావాసం కూడా కల్పిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వం రైతులతో పాటు అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నదని, ఆ దిశగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరేశ్, సర్పంచులు చిందం రమేశ్, కన్నం మధు, ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కమీటీ సభ్యుడు కొట్టెపల్లి సుధాకర్, ఎంపీటీసీ ఉపేందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, టీఆర్ఎస్ రైతు విభాగం మండలాధ్యక్షుడు నిమ్మ శ్రీనివాసరెడ్డి, నాయకులు శంకర్, రాములు, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇంత తొందరగా ఇస్తరని అనుకోలె..
మా ఇల్లు గురువారం వర్షానికి కూలిపోయింది. మస్తు బాధపడ్డం. ప్రభుత్వం మీకు సాయం అందిస్తుందని అధికారులు చెప్తే మేం నమ్మలె.
కానీ, 24గంటల్లోనే మాకు పరిహారం అందించిన్రు.
ఇంత తొందరగా ఇస్తరని మేం అనుకోలె. చాలా సంతోషంగా ఉన్నది. ప్రభుత్వం పేదలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నది. ఆపద సమయాల్లో సాయం అందిస్తున్నది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– కొత్తకొండ లస్మయ్య, రామన్నపేట