జగిత్యాల కలెక్టరేట్/ జగిత్యాల రూరల్, జులై 15: రాయికల్ మండలం భూపతిపూర్ వాగులో గల్లంతై మరణించిన జర్నలిస్ట్ జమీర్ ఉదంతంలో జగిత్యాల ఎ మ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నీ తానై వ్యవహరించారు. ఈ నెల 12న మంగళవారం రాత్రి గల్లంతైనప్పటి నుంచి అంత్యక్రియల దాకా అతడి కుటుండం వెంటే ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. రూ.25 వేలు వెచ్చించి ఎక్స్కవేటర్లను తెప్పించా రు. నాలుగురోజులపాటు పొద్దంతా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూనే చీకటిపడిన తర్వాత భూపతిపూర్ వాగు వద్దకు వెళ్లి పరిశీలించారు. సహాయక చర్యలను ముమ్మ రం చేయించారు. శుక్రవారం ఉదయం మృ తదేహం దొరకడంతో అధికారులు, స్థానిక యువకుల సహాయంతో వెలికితీయించారు. విగతజీవిగా కనిపించిన జమీర్‌ను చూసి కంటతడి పెట్టారు. అంతలోనే తేరుకొని సంఘటనా స్థలంలోనే పోస్ట్‌మార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.50 వేలు అందించారు. శుక్రవారం సాయంత్రం జగిత్యాలలో నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. జమీర్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ప్రకృతి వైపరీత్యాల కింద ప్రభుత్వం ద్వారా రూ.4 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి కొప్పుల దిగ్భ్రాంతి
జర్నలిస్ట్ జమీర్ మృతిపై మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అతడి ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. కుటుంబానికి ప్రభుత్వపరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
జమీర్ మృతి బాధాకరం : ఎమ్మెల్సీ కవిత
విధినిర్వహణకు వెళ్లి వరదల్లో కొట్టుకుపోయిన జర్నలిస్టు జమీర్ మరణం అత్యంత బాధాకరమని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. శుక్రవారం ట్విట్టర్ ద్వారా సంతాపం ప్రకటించారు. అత డి కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. వార్తా సేకరణకు ప్రాధాన్యత ఇస్తూనే వర్షాలు, వరదల పట్ల అప్రమత్తంగా ఉంటూ మీడియా మిత్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.