తెలంగాణచౌక్, జూలై 15: సకాలంలో ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందని వాహనాలపై రోజుకు రూ.50 జరిమానా విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 714ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయడాన్ని హర్షిస్తూ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట సీఎం కేసీఆర్, మంత్రి గంగుల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తమ పొట్ట కొట్టేందుకు తెచ్చిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం హర్షణీయమన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలతో ఆటోలు నడుపలేక ఉపాధికి దూరమయ్యే దుస్థితిలో ఉన్న తమపై సీఎం కేసీఆర్ దయచూపడం మరిచిపోలేమని చెప్పారు. కేంద్రం తెచ్చిన జీవో 714 రద్దు చేయడమే కాకుండా గతేడాది బకాయిలను మాఫీ చేయడం తమపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమకు నిదర్శనమని కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మద్దెల రాజేందర్, ప్రధాన కార్యదర్శి బండారి సంపత్, ఉపాధ్యక్షులు రాంగోపాల్‌రెడ్డి, నరసింహనాయక్, ఎండీ సాధిక్, నాయకులు చంద్రశేఖర్, తిరుపతి, సత్యనారాయణ, మహేదర్ తదితరులు పాల్గొన్నారు.