సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): లేఅవుట్‌ను అభివృద్ధి చేయకుండానే కొనుగోలుదారుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు మొట్టికాయలు వేసింది కన్జ్యూమర్ ఫోరం. కమిషన్‌ను ఆశ్రయించిన ఓ కొనుగోలుదారుడికి రూ.5 లక్షలు చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి.లక్ష్మీప్రసన్నలతో కూడిన బెంచ్ ఆదేశించింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలోని సర్వే నంబర్ 801/పీ లో ఎలాంటి అనుమతులు లేకుండానే ఇంక్రెడిబుల్ ఇండియా సంస్థ లే అవుట్ చేసింది. ఈ విషయాన్ని లోకల్ చానళ్లల్లో ప్రచారం చేసుకుంది.
ప్రకటనలు చూసి సికింద్రాబాద్‌కు చెందిన కేఎల్వీ ప్రసాద్ రెండు ప్లాట్లను కొనుగోలు చేస్తానని ఒక్కో దానికి రూ. 12వేలు చెల్లించి.. బుక్ చేసుకున్నాడు. సేల్ అగ్రిమెంట్ సమయంలో పాస్‌బుక్ నంబర్ 0868కు రూ.2,59,250, పాస్‌బుక్ నంబర్ 1415- రూ.2,59,250 చొప్పున 2017లో కట్టాడు. 2019 చివరిలో ప్లాట్లను అప్పజెప్పుతామని 2015లోనే ఒప్పందం కుదిరింది. ఎల్పీ నంబర్ లేకుండానే అప్పగించడంతో కంగుతిన్న బాధితుడు.. సంస్థ ఎండీని అనేక సార్లు సంప్రదించి.. తన డబ్బులు వాపస్ ఇవ్వాలని కోరగా, నిరాకరించడంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన కమిషన్.. 2015 నుంచి ఇప్పటి వరకు బాధితుడికి రూ.5,18,500.. 9 శాతం వడ్డీతో కలిపి తిరిగి కట్టాలని, నష్టపరిహారంగా రూ.10వేలు, కోర్టు ఖర్చుల కింద రూ.5వేలు చెల్లించాలని ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌ను ఆదేశించింది.