చిగురుమామిడి, జూలై 15 : ఆరు రోజులు కురిసిన వర్షాలకు మండలంలోని అన్ని గ్రామాల్లో కుంటలు, చెరువులు నిండాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. రేకొండ, చిగురుమామిడి, సుందరగిరి, బొమ్మనపల్లి, ఇందుర్తి, ముదిమాణిక్యం, రామంచ, ములనూర్ తదితర గ్రామాల్లో చెరువులు నిండి కళకళలాడుతున్నాయి. కాగా, మండలంలో వర్షాలతో నష్టపోయిన వారి వివరాలను ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. మండలంలో జరిగిన ఆస్తి, పంట నష్టంపై కలెక్టర్‌కు నివేదిక అందజేయాలని ఎంపీపీ మండల అధికారులను కోరారు.
మానకొండూర్ మండలంలో..
మానకొండూర్ రూరల్, జూలై 15: మండలంలోని కొండపల్కల, మద్దికుంట, దేవంపల్లి, శ్రీనివాస్‌నగర్, అన్నారం, ముంజంపల్లి పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు, వాగులు నిండుకుండలా మారాయి. వాన తగ్గుముఖం పట్టడంతో పంట పొలాల్లో నిలిచిన వరద తొలగుతున్నది. ఈదులగట్టెపల్లి, వెల్ది, వేగురుపల్లి, లింగాపూర్, ఊటూర్ గ్రామాల శివారుల్లో ఉన్న కల్వర్టుల వద్ద సైతం వరద తగ్గుముఖం పట్టడంతో రాకపోకలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్ మండలంలో..
కరీంనగర్ రూరల్, జూలై 15: ఇటీవల కురిసిన వర్షాలకు కరీంనగర్ మండలంలోని నగునూర్, చెర్లభూత్కూర్, ఎలబోతారం, ఇరుకుల్ల, చామనపల్లి, గోపాల్పూర్, మొగ్దుంపూర్, ఇరుకుల్ల గ్రామాల్లోని చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి. పొలాల్లో నీరు నిలువడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చెర్లభూత్కూర్ కొత్త చెరువు మత్తడి దుంకుతున్నది. ఎర్ర చెరువుకు గండి పడింది. ఊర చెరువులోని వరద నీరుతో మత్తడి దుంకడంతో కట్ట వద్ద ఉన్న చెర్లభూత్కూర్- తాహెర్ కొండాపూర్ తారురోడ్డు కొటుకుపోయింది. రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నగునూర్‌లో రాత్రి వల్లంపహడ్ వద్ద ట్రాన్స్ఫార్మర్ స్తంభాలు విరిగి తీగలగుట్టపల్లి, వల్లంపహడ్, నగునూర్, జూబ్లీనగర్, చామనపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గోపాల్పూర్, దుర్శేడ్, నగునూర్ చెక్ డ్యాం పొంగి పొర్లుతున్నది. ఆయా చోట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.