ఒకప్పుడు కరువుతో అల్లాడిన గన్నేరువరం (ఉమ్మడి బెజ్జంకి మండలం) నేడు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలమైంది. సాగు నీరు సమృద్ధిగా అందుబాటులోకి రావడంతో పంటల విస్తీర్ణం పెరిగి పచ్చటి పొలాలతో కళకళలాడుతున్నది. ఈ క్రమంలో ఇతర రాష్ర్టాల కూలీలూ ఉపాధి కోసం ఇక్కడకు వస్తుండడం.. ప్రభుత్వ పథకాలతో ఎనిమిదేండ్లలో జరిగిన అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నది.
– గన్నేరువరం, జూలై 15
మండలంలో వానకాలం పంటల సాగు జోరందుకున్నది. ఈ క్రమంలో ఉత్తర భారత దేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ర్టానికి చెందిన 200 మంది కూలీలు వ్యవసాయ పనుల కోసం వచ్చారు. చీమలకుంటపల్లి గ్రామంలో రైతు కుసుంబ ఆంజనేయులు, కుసుంబ నవీనకు చెందిన పొలంలో 20 మంది మగ కూలీలు నాట్లు వేస్తున్నారు. ఒక్క రోజు ఆరు ఎకరాల నాటు వేస్తూ రూ.600-700 వరకు సంపాదిస్తున్నారు. ఈ సందర్భంగా తమ రాష్ట్రంలోని పరిస్థితులు, తెలంగాణలో అభివృద్ధి గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
రోజుకు 700 సంపాదిస్తున్నం
మేము ఒక్క రోజు ఆరు ఎకరాల్లో నాటు వేస్తాం. రోజుకు రూ.700 దాకా సంపాదించుకుంటున్నం. యూపీ నుంచి పని కోసం వచ్చిన మమ్మల్ని ఇక్కడి రైతులు బాగా ఆదరిస్తున్నారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. తెలంగాణలో కరువు అనేది లేనే లేదు. వ్యవసాయం చాలా బాగా సాగుతున్నది. నాట్లు అయ్యే వరకు మాకు ఉపాధికి ఢోకా లేదు.
– సోంపాల్, వ్యవసాయ కూలీ
అభివృద్ధికి నిదర్శనం…
గతంలో మా గ్రామం నుంచి ఎంతో మంది ఉపాధి కోసం దుబాయ్ పోయే వారు. ఇప్పుడు పని కోసం ఇతర రాష్ర్టాల వారు తెలంగాణకు వస్తుండడం మన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి నిదర్శనం. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అభివృద్ధి లోపించడంతో ఉపాధి కరువైంది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో వ్యవసాయ రంగం అభివృద్ధి పథంలో సాగుతున్నది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఉపాధి దొరుకుతుండగా, మాకు కూలీల కొరత తీరింది.
-కుసుంబ నవీన, టీఆర్ఎస్ మహిళా విభాగం మండలాధ్యక్షురాలు
తెలంగాణ ప్రభుత్వం భేష్
మాది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరేలి జిల్లా ఎంకరీపూర్ గ్రామం. యూపీలో మాకు బతుకు దెరువు లేక ఇక్కడికి వరినాట్లు వేయడానికి వచ్చాం. తెలంగాణలో వ్యవసాయం చాలా బాగా సాగుతున్నది. ఎక్కడ చూసినా పుష్కలంగా నీరు ఉన్నది. ప్రతి రైతు ఆనందంగా ఉన్నాడు. ఇక్కడి ప్రభుత్వం వ్యవసాయానికి కరెంటు ఉచితంగా 24 గంటలు ఇవ్వడం గొప్ప విషయం. పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం పైసలు కూడా ఇస్తున్నదని విని ఆశ్చర్యపోయాం.
– సురేందర్, వ్యవసాయ కూలీ