రామడుగు, నవంబర్ 30 : దేశరాజ్‌పల్లిలో మూడెరాల్లో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లెప్రకృతివనాన్ని త్వరితగతిన తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. మండలంలోని దేశరాజ్‌పల్లి, గోపాల్రావుపేట, రామడుగు గ్రామాలను మంగళవారం అదనపు కలెక్టర్ సందర్శించారు. ముందుగా దేశరాజ్‌పల్లి ఎస్సారెస్పీ పరిధిలోని భూములను సందర్శించారు. ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, అధికారులతో మాట్లాడుతూ, భూమిని స్వాధీనం చేసుకొని త్వరితగితిన మొక్కలు నాటాలన్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు అడ్డుపడి ఇక్కడి భూముల్లో ధాన్యం ఆరబోసుకుంటున్నామని తెలిపారు. ధాన్యం ఆరబోసిన భూములను ఉపయోగించడంలేదని వివరించారు. ఈ మూడెకరాల్లో ముళ్లపొదలు, గడ్డిని తొలగించాలని ఏపీవో రాధకు సూచించారు. భూమిని చదును చేసి మొక్కలు నాటాలన్నారు. నీటి సమస్యను అధిగమించడంపై అధికారులతో చర్చించారు. ట్యాంకర్లతో నీరు పోయాలని సూచించారు. ఎక్కువ సంఖ్యలో కూలీలు హాజరయ్యేలా చూడాలన్నారు. అనంతరం గోపాల్రావుపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రోత్ మానిటరింగ్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ పుట్టిన ప్రతి శిశువు బరువుకు తగిన ఎత్తు, బరువు ఉండాలని సూచించారు. స్థానికంగా బరువు తక్కువగా ఉన్న నలుగురు పిల్లల తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. కిరాణా దుకాణాల నుంచి తెచ్చిన బిస్కెట్లు, చాక్లెట్లు, తినుబండారాలు పిల్లలకు ఇవ్వకూడదన్నారు. అలాంటి వాటిని పిల్లలు తినడంవల్ల ఆకలి మందగించి, ఆరోగ్యం క్షీణిస్తుందన్నారు.
ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే గర్భిణులుగా ఉన్న సమయంలోనే ఆహార విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తల్లి మంచి ఆహారం తీసుకోవడం ద్వారా పుట్టబోయే బిడ్డకూడా ఆరోగ్యంగా ఉంటుందని, వారి పెరుగుదల కూడా బాగుంటుందని చెప్పారు. బరువు తక్కువగా పుడితే నెలనెలా బరువు మరింత తగ్గుముఖం పడుతుందన్నారు. తద్వారా రక్తహీనత పెరిగి శిశు మరణాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ప్రతి తల్లీ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యాధికారులతో మాట్లాడారు. కలెక్టర్ కర్ణన్ చేపట్టిన అనీమియా ముక్త్ కరీంనగర్ పథకంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా అధికారులు, సిబ్బందికి అనీమియా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు అనీమియా పరీక్షలు చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా వైద్యాధికారి జువేరియా, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, ఎంపీవో సతీశ్‌రావు, సర్పంచ్ కోల రమేశ్, సీడీపీవో కస్తూరి, రామడుగు, గోపాల్రావుపేట పీహెచ్‌సీల వైద్యాధికారులు శ్రీనివాస్, సురేశ్, పోషణ్ అభియాన్ జిల్లా అసిస్టెంట్ కోఆర్డినేటర్ రొమిలా, బ్లాక్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ సమత, నాయబ్ తహసీల్దార్ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ జయప్రద, అంగన్వాడీ టీచర్లు విజయ, సావిత్రి, పద్మజ, లావణ్య, హుస్సేనా, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.