గంగాధర, జూలై 15: వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం శుక్రవారం గెరువిచ్చింది. నారాయణపూర్ రిజర్వాయర్, గంగాధర ఎల్లమ్మ చెరువు కట్టలు తెగిపోవడంతో నిన్నటి వరకు ఉధృతంగా ప్రవహించిన గంగాధర వాగు ప్రవాహం తగ్గిపోయింది. ఇండ్లల్లో నుంచి నీళ్లు బయటకు పోవడంతో పునరావాస కేంద్రంలో తలదాచుకున్న ఇస్తారిపల్లి, నారాయణపూర్ గ్రామస్తులు ఇండ్లకు చేరుకున్నారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో భాస్కర్‌రావు, ఎస్ఐ రాజు, ఎంపీవో జనార్దన్‌రెడ్డి, గంగాధర, నారాయణపూర్ సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, ఎండీ నజీర్ గ్రామస్తులకు పునరావాస కేంద్రంలో భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం ప్రత్యేక వాహనాల్లో ఇండ్లకు తరలించారు. కాగా, గంగాధర వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టిరోడ్డు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇస్తారిపల్లి వద్ద వంతెన పూర్తిగా దెబ్బతిన్నది. నారాయణపూర్, ఇస్తారిపల్లిలో సర్పంచులు గంగాధర, నజీర్ వరద పరిస్థితిని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. బూరుగుపల్లి గ్రామంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు ఇంటింటికీ వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.
రోడ్డుకు మరమ్మతులు
చొప్పదండి, జూలై 15: వారం రోజులుగా కురిసిన వర్షాలకు పట్టణంలోని శనగకుంట పక్కన ఉన్న రోడ్డు దెబ్బతిన్నది. కాగా, రోడ్డుకు ఇరువైపులా మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ శుక్రవారం మొరం పోయించి మరమ్మతులు చేయించారు. ఈసందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, శనగకుంట పూర్తి స్థాయిలో నిండి తెగిపోయే ప్రమాదం ఉన్నందున నీళ్లు బయటకు వెళ్లేలా కాల్వ తీయించినట్లు తెలిపారు. కుంట పక్కకు ఉన్న రోడ్డుకు ఇరువైపులా మట్టి కొట్టుకుపోవడంతో మొరం పోయించి చదును చేయించినట్లు పేర్కొన్నారు.
వెదిరలో పంటల పరిశీలన
రామడుగు, జూలై 15: మండలంలోని వెదిరతో పాటు అనుబంధ గ్రామం వెంకటగిరిలో భారీ వర్షాలతో దెబ్బతిన్న పత్తి పంటలను శుక్రవారం మండల వ్యవసాయాధికారి యాస్మిన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి మాట్లాడుతూ, పత్తి పంటలో నిలిచిన వర్షపు నీటిని తొలగించాలని సూచించారు. పంట మొక్కలు ఎదగాలంటే పొడి వాతావరణం ఏర్పడిన వెంటనే ఎకరాకు 15 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలన్నారు. ఇక్కడ ఏఈవో సంపత్, ఆర్బీఎస్ కో-ఆర్డినేటర్ దొడ్డ లచ్చిరెడ్డి, రైతులు ఉన్నారు.