భారీ వర్షాల నేపథ్యంలో సర్కారు అలర్ట్ అయింది. జనజీవనంపై ప్రభావం పడకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఇప్పటికే రంగంలోకి దిగారు. వానను సైతం లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. బాధితులకు భరోసానిస్తున్నారు. ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ.. సహాయ సహకారాలను అందిస్తున్నారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటు జిల్లాల వారీగా కలెక్టర్లు, తమ పరిధిలో సిబ్బందికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశమున్న నేపథ్యంలో ఇండ్ల నుంచి బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
కరీంనగర్, జూలై 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారీ వర్షాలతో నేపథ్యంలో రాష్ట్ర సర్కారు అలర్ట్ అయింది. జనజీవనంపై ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ క్షేత్రస్థాయిలోనే పర్యటిస్తూ.. ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఇదే సమయంలో జిల్లాయంత్రాగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు సిరిసిల్ల జిల్లా పరిస్థితిని తెలుసుకుంటూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. గత పరిస్థితులు పునరావృతం కాకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. మరోవైపు ఎమ్మెల్యేలు సైతం వర్షాన్ని లెక్క చేయకుండా ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతున్నారు. తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఎక్కడిక్కడ అధికారయంత్రంతో కలిసి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలో అత్యవసర విభాగాలకు ఉద్యోగుల సెలవులను రద్దు చేసిన కలెక్టర్లు, కమిషనర్లు, ఎస్పీలు.. నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడ ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
రాత్రింబవళ్లు వివరాలు ఆరా తీస్తున్నారు. మరోవైపు గోదావరితోపాటు ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరోరెండు రోజుల పాటు వర్షాలు ఇలాగే ఉండే అవకాశాలున్నాయని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు ఏ ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందిస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమదమున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే సన్నద్ధంగా ఉన్నారు. మందులు అందుబాటులో ఉంచుకోవడంతోపాటు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. అవసరమైన చోట క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు అన్ని జిల్లాల్లో విద్యుత్‌శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. భారీ వర్షాలతో అక్కడక్కడ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండగా, వెంటనే రంగంలోకి దిగి సరిచేస్తున్నారు.
పూర్వ జిల్లాలో 4,566 చెరువులుండగా, ఇప్పటికే 3,105 చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. గురువారం రాత్రి వరకు అన్ని చెరువులూ మత్తడి దుంకే అవకాశాలున్నాయి. వర్షాలు సింగరేణిపై పెను ప్రభావం చూపుతున్నాయి. పూర్తిగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రోజుకు 8 వేల టన్నుల చొప్పున ఈ ఐదు రోజుల్లో 40వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. ఫలితంగా లక్షలాది రూపాయల నష్టం వాటిల్లినట్లు యంత్రాంగం చెబుతున్నది.
శభాష్ మేడమ్
పెగడపల్లి, జూలై 13 : ఐతుపల్లికి చెందిన పలుమారు వేణు భార్య రూప నిండు గర్భిణి. బుధవారం సాయంత్రం ఆమెకు నొప్పులు రావడంతో భర్త వేణు 108 వాహనానికి ఫోన్ చేశాడు. వరదల కారణంగా ఆ వాహనం వచ్చే పరిస్థితి లేక వారు 100 డయల్‌కు కాల్ చేశారు. వెంటనే స్పందించిన ఎస్ఐ శ్వేత ఐతుపల్లికి చేరుకుని, గర్భిణి రూపను తన పోలీస్ వాహనంలో స్వయంగా దవాఖానకు తీసుకెళ్లారు. కరీంనగర్ వెళ్లే ప్రధాన రోడ్లు మూసేయడంతో గంగాధర మండలం చెర్లపల్లి, కాశిరెడ్డిపల్లి మీదుగా కొడిమ్యాల మండలం పూడూరు సమీపంలోని వెంకటాయపల్లి వద్ద జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారి వద్దకు తీసుకొచ్చి, అక్కడి నుంచి 108 వాహనంలో కరీంనగర్‌కు తరలించారు. దాంతో రూప కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆశా కార్యకర్త బొమ్మెన రేణుక, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోలి సంజీవరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పలుమారు విజయ్‌యాదవ్, విక్రమ్ ఉన్నారు.
జగిత్యాల కలెక్టరేట్ కంట్రోల్ రూం
08724 222841
ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూం
7702492610
మెట్పల్లి ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూం
9000068092
కోరుట్ల ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూం
9985252016
పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయం
7995070702
రాజన్న సిరిసిల్లకలెక్టరేట్ కార్యాలయం
9398684240
కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం
08782265208
కరీంనగర్ (ప్రత్యేకంగా విద్యుత్ సమస్యల కోసం) ఎస్ఈ ఎన్పీడీసీఎల్ ఆఫీస్
9440811444